
కృష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి) ఈ నెల 27వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించింది. హైదరాబాద్ జలసౌధ లోని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయంలో ఉదయం పదకొండు గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది.
ఇరు రాష్ట్రాల వానాకాలం పంటలకు అవసరమైన నీటి విడుదల అంశంపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల నీటి వాటాలు, ప్రాజెక్టులలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, తాగునీటి అవసరాలు పోను సాగునీటికి ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించాలనే అంశాలపై కెఆర్‌ఎంబి చర్చించనున్నది. ఈ మేరకు బోర్డు ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చింది.
రెండు రాష్ట్రాల అధికారులు తమ తమ రాష్ట్రాల అవసరాలు, డిమాండ్లను ఈ సమావేశంలో బోర్డు ముందు ప్రతిపాదనలు పెట్టి చర్చించే అవకాశాలు ఉన్నాయి.ఈ సమావేశంలో బోర్డు ఉద్యోగులకు సంబందించిన ఇన్సెంటివ్ రద్దు, రికవరీ అంశాన్ని కూడా చర్చించనున్నది. వీటిపై కెఆర్‌ఎంబి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బోర్డు ఉద్యోగులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కృష్ణా బోర్డు తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు 2023 సంవత్సరంలో నిలుపుదలచేసింది. ఈ నేపథ్యంలోనే డివిజన్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్‌పై చర్చించేందుకు నిర్ణయించింది.
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!