భారత్ తో రష్యా దీర్ఘకాలిక ఆర్థిక సంబంధాలు

భారత్ తో రష్యా దీర్ఘకాలిక ఆర్థిక సంబంధాలు

* త్వరలోనే కార్యచరణ ప్రణాళిక

భారత్తో దీర్ఘకాలిక ఆర్థిక సహకార ప్రణాళికలను తమ దేశం ముందుకు తీసుకువెళ్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. భారత్ తో 2030 వరకు దీర్ఘకాలిక సహకారం కోసం మాస్కో కార్యాచరణ ప్రణాళికను త్వరలో ఖరారు చేస్తామని ప్రకటించారు. సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక ప్లీనరీ సమావేశంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

“భారత్ సహా తన కీలక భాగస్వాములతో మాస్కో దీర్ఘకాలిక ఆర్థిక సహకార ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్తుంది. ముఖ్య భాగస్వాములతో దీర్ఘకాలిక సహకార ప్రణాళికలను సిద్ధం చేయడానికి మేము అంగీకరించాం. చమురు, గ్యాస్‌ ఎగుమతులు పెంచడానికి ఇప్పటికే మేము లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం” అని తెలిపారు. దీనిని ముందుకు తీసుకువెళ్లడానికి భాగస్వాములకు వాణిజ్య అడ్డంకులను తొలగిస్తూ కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్నామని చెప్పారు. 

మౌలిక సదుపాయాలను కల్పిస్తామని, పెట్టుబడి సహకారాన్ని మరింతగా పెంచుకుంటాం  అని పుతిన్ వివరించారు.  మరోవైపు, ఇండియా- రష్యా బిజినెస్ ఫోరమ్లో భారత్‌ తరఫున కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హాజరయ్యారు. ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ అనే సెషన్లో ప్రసంగించారు. భారత్ లో ఏఐ పురోగతిని, సమ్మిళిత సాంకేతిక వృద్ధిలో భారత్ పాత్రను వివరించారు.

భారత్‌-రష్యాల మధ్య లోతైన ఆర్థిక సంబంధాలు, సహకారం కోసం మరిన్ని కొత్త మార్గాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రష్యన్ ఫెడరల్ మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నాయకులు, పెట్టుబడిదారులతో అశ్విని వైష్ణవ్ భేటీ అయ్యారు. రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైల్వే ఆధునికీకరణ, సమాచార సాంకేతికత, కృత్రిమ మేధస్సు వంటి కీలక రంగాలలో భారతదేశం-రష్యా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై వారితో చర్చలు జరిపారు.

మరోవైపు, సాంకేతికత ఆధారిత, మౌలిక సదుపాయాల రంగాలలో రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంపొందించడానికి భారత్‌ నిబద్ధతతో ఉందని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం పత్రికా ప్రకటనలో పేర్కొంది.  అశ్విన్ వైష్ణవ్ పర్యటన భారత్- రష్యా దీర్ఘకాలిక సంబంధాన్ని బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా అభివర్ణించింది. పరస్పర వృద్ధి, ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తుందని అభిప్రాయపడింది.

కాగా, ఇజ్రాయెల్, ఇరాన్ లతో రష్యా శాంతి ప్రతిపాదనలను పంచుకుందని పుతిన్ చెప్పారు. ఇరాన్లో రష్యా నిర్మించిన అణు విద్యుత్ కేంద్రంలో రష్యన్ సిబ్బందిని కాపాడతామని ఇజ్రాయెల్ తనకు హామీ ఇచ్చిందని తెలిపారు. వారం రోజుల పాటు జరిగిన యుద్ధాన్ని ముగించడానికి తాను రెండు వైపులా సంప్రదించానని తెలిపారు. మాస్కో తన మిత్రదేశమైన టెహ్రాన్ కు మద్దతు ఇవ్వడంలో విఫలమైందనే ఆరోపణలను పుతిన్ తీవ్రంగా ఖండించారు. ఇరాన్, ఇజ్రాయెల్ రెండింటితోనూ మంచి సంబంధాలను కొనసాగించిందని పేర్కొన్నారు.