
ఎన్నికల సరళికి సంబంధించిన వీడియోలను దుర్వినియోగం చేసి తప్పుడు కథనాలు సృష్టించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల ఫలితంపై 45 రోజుల్లోగా ఎలాంటి ఫిర్యాదులు రాకపోతే ఆ ప్రక్రియకు సంబంధించిన సీసీటీవీ కెమెరా రికార్డింగ్లు, వెబ్ కాస్టింగ్, వీడియో ఫుటేజ్‌లను తొలగించాలని రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించింది.
దీనికి సంబంధించి రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు మే 30న లేఖలు పంపగా ఆ విషయం తాజాగా బయటపడింది ఇటీవల పోలింగ్ స్టేషన్ల వీడియో ఫుటేజీలను దుర్వినియోగం చేసి కొందరు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, కథనాలను వ్యాప్తి చేస్తున్నట్లు ఎన్నికల సంఘం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులకు ఈసీ పలు ఆదేశాలు జారీ చేసింది.
పోలింగ్ స్టేషన్ల వెబ్ కాస్టింగ్ ఫుటేజీని బహిరంగపర్చాలన్న డిమాండ్లపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ పోలింగ్ స్టేషన్ల వీడియో ఫుటేజీని షేర్ చేయడం అంటే ఓటర్ల గోప్యత, భద్రతను ఉల్లంఘించడమే అవుతుందని అభిప్రాయపడింది. ఫుటేజీని విడుదల చేయాలనే డిమాండ్లు ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడేలా, పారదర్శకతను ప్రోత్సహించేలా కనిపిస్తున్నప్పటికీ అవి వాస్తవానికి ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సీసీ టీవీ ఫుటేజీలు బహిరంగపర్చాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈసీ అధికారులు ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ స్టేషన్లలోని వీడియో ఫుటేజీని బహిరంగపర్చడం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, 1951 ప్రకారం, అలాగే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పూర్తిగా చట్టం విరుద్ధమని ఈసీ అధికారులు పేర్కొన్నారు.
పోలింగ్ ప్రక్రియ ఫుటేజీని షేర్ చేయడం వల్ల ఎవరు ఓటు వేశారో లేదా గైర్హాజరయ్యారో గుర్తించడం సులభతరం అవుతుందని తెలిపారు. అప్పుడూ ఓటు వేసినవారు, వేయనవారు సమాజ వ్యతిరేక శక్తుల నుంచి ఒత్తిడి, వివక్ష, బెదిరింపులకు గురవుతారని అభిప్రాయపడ్డారు.
“ఒక నిర్దిష్ట బూత్ లో ఏదైనా రాజకీయ పార్టీకి తక్కువ ఓట్లు వస్తే, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఏ ఓటరు తమకు ఓటు వేశారో? ఏ ఓటరు ఓటు వేయలేదో? సులభంగా గుర్తించవచ్చు. ఆ తర్వాత రాజకీయ పార్టీలు వారిని వేధించవచ్చు. బెదిరింపులకు పాల్పడవచ్చు. కచ్చితంగా చెప్పాలంటే ఈసీ సీసీటీవీ ఫుటేజ్ ను 45 రోజుల పాటు ఉంచుతుంది. సీసీటీవీ పుటేజ్లు, వెబ్ కాస్టింగ్ ఈసీ అంతర్గత పర్యవేక్షణ యంత్రాంగాలు. ఎన్నికల ప్రక్రియలో చట్టబద్ధంగా తప్పనిసరి కాదు” అని తెలిపింది.
“ఎన్నికల ఫలితంపై 45 రోజుల్లోగా ఎలాంటి ఫిర్యాదులు రాకపోతే ఆ ప్రక్రియకు సంబంధించిన సీసీటీవీ కెమెరా రికార్డింగ్లు, వెబ్ కాస్టింగ్, వీడియో ఫుటేజీలను తొలగిస్తాం. అయితే, ఇటీవల ఈ రికార్డులను దుర్వినియోగం చేసి కొందరు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, కథనాలను వ్యాప్తి చేస్తున్నారు. 45 రోజుల్లోపు ఎన్నికల ఫలితంపై పిటిషన్ దాఖలు చేస్తే సీసీటీవీ ఫుటేజ్ను తొలగించము. ఓటరు గోప్యత విషయంలో ఎప్పుడూ రాజీపడబోం” అని ఈసీ అధికారులు స్పష్టం చేశారు.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు