
అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ కు నిరసన సెగ తగిలింది. సొంత దేశ ప్రజలే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ఫీల్డ్ మార్షల్ కాదు.. ఫెయిల్డ్ మార్షల్’ అంటూ విమర్శించారు. ఐదు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆసిమ్ మునీర్ ఆదివారం అగ్రరాజ్యానికి చేరుకున్నారు. అక్కడ వాషింగ్టన్‌లోని ఓ హోటల్‌లో దిగారు.
ఈ విషయం తెలుసుకున్న పాక్‌కు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఆ హోటల్ వద్దకు చేరుకున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆసిమ్ మునీర్ హోటల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ‘ఆసిమ్ మునీర్.. నువ్వు పిరికివాడివి’, ‘నీకు సిగ్గు లేదు..’, ‘సామూహిక హంతకుడు..’, ‘నియంత..’, ‘ఫెయిల్డ్ మార్షల్..’ వంటి నినాదాలు చేశారు.
మునీర్ బస చేసే హోటల్ ముందు నిరసనకారులు ‘నువ్వొక సామూహిక హంతకుడివి, నియంతవు, నీ ప్రవర్తనకు సిగ్గుపడు, నీ సమయం ముగిసింది… పాకిస్థాన్ పురోగతి చెందుతుంది.. తుపాకులు మాట్లాడితే ప్రజాస్వామ్యం పతనమవుతుంది’ అని పేర్కొంటూ డిజిటల్ బోర్డులతో ప్రదర్శన నిర్వహించారు. మునీర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిరసనకారుల ఆందోళనలతో అప్రమత్తమైన అధికారులు వారిని అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో సైన్యాధ్యక్షుడు జనరల్ ఆసిమ్ మునీర్‌కి ఫీల్డ్ మార్షల్ గా పాక్ ప్రభుత్వం పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఈ నిర్ణయం తీసుకుంది.
భారత్‌తో పోరులో పాక్ బలగాలను ముందుండి నడిపించినందుకే ఆయన ప్రమోషన్ ఇచ్చినట్టు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఫీల్డ్ మార్షల్ అన్నది పాక్‌లో అత్యున్నత మిలిటరీ ర్యాంకు. పాక్‌లో ఈ హోదా పొందిన రెండో వ్యక్తి మునీరే కావడం విశేషం. ఇంతకుముందు 1959లో జనరల్ ఆయుబ్ ఖాన్‌కు ఫీల్డ్ మార్షల్ హోదా కట్టబెట్టారు. 2022 నవంబర్‌లో ఆర్మీ చీఫ్‌గా మునీర్ బాధ్యతలు చేపట్టారు. మునీర్‌కు ఆ దేశ సుప్రీంకోర్టు ఇటీవలే మరిన్ని అధికారాలు కల్పించింది. మిలిటరీ కోర్టుల్లో పౌరులను విచారించేందుకు అనుమతించింది.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా