బాసర తీరంలో అయిదేండ్లలో 51 మంది మృతి

బాసర తీరంలో అయిదేండ్లలో 51 మంది మృతి

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర గోదావరి నదిలో పుణ్య స్నానాలకు వచ్చే భక్తులకు భద్రత కరువైంది. ఆల‌యానికి కోట్లాది రూపాయ‌లు ఆదాయం వ‌స్తున్నా భ‌క్తులు పుణ్య‌స్నానాలు ఆచ‌రించే చోట భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో అధికారులు నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారు. ఐదేళ్లుగా అధికారుల నిర్ల‌క్ష్యానికి 51 మంది బ‌ల‌య్యారు. సాధార‌ణంగా జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు తొలుత గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు.

అయితే స్నాన ఘాట్‌ల‌ వద్ద సరైన ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. అలాగే ప్ర‌మాదాల‌కు కూడా గుర‌వుతున్నారు. కొంద‌రు న‌ది మ‌ధ్య‌లో ఉన్న ఇసుక‌మేట‌ల వ‌ర‌కూ ప‌డ‌వ‌లో వెళ్లి అక్క‌డ స్నానాలు చేస్తున్నారు. ఇక్క‌డ సుమారు ముప్ప‌యి వ‌ర‌కు ప‌డ‌వ‌లు ఉన్నాయి. ఇసుక మేట‌ల వ‌ర‌కూ తీసుకెళ్లి అక్క‌డ వ‌దిలి ప‌డ‌వ నిర్వ‌హ‌కులు వ‌చ్చేస్తున్నారు. ఆ ఇసుక మేట‌ల వ‌ద్ద స్నానాలు చేసే వారికి నీటి లోతు తెలియ‌క ప్ర‌మాదాల‌కు గురై గ‌ల్లంతు అవుతున్నారు.

ఆదివారం హైద‌రాబాద్‌లోని చింత‌ల్ బ‌రి, దిల్‌షుక్‌న‌గ‌ర్‌కు చెందిన ఐదుగురు గోదావ‌రి న‌దిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. గ‌త వారం పుణ్యస్నానాలు చేయడానికి వచ్చి ఇద్దరు మృతి చెందారు.గోదావరి నదిలో ఐదేళ్ల‌లో ప్రమాదవశాత్తు 2021లో పది మంది, 2022లో 12 మంది, 2023లో 11 మంది, 2024లో పది మంది, 2025 లో ఆరు నెల‌ల‌కు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. స్నానాల ఘాట్ వ‌ద్ద ఎటువంటి సూచిక బోర్డులు లేవని, గజ ఈతగాళ్ల జాడే లేదని, లైవ్‌ జాకెట్లు మచ్చుకైనా కనిపించలేదని, అధికారులు, సిబ్బంది భక్తులను పట్టించుకున్న పాపాన పోవడంలేదని ప‌లువురు భ‌క్తులు ఆరోపించారు. 

నది లోపలికి వెళ్లకుండా ఉండేందుకు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టలేదని, కనీసం కంచె ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకునేలా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేయాలనిడిమాండ్‌ చేశారు. బాస‌ర వ‌ద్ద గోదావ‌రి న‌దిలో బోటింగ్ నిర్వ‌హ‌ణ ఉంది. నాటు ప‌డ‌వ‌ల‌తో బోటింగ్ నిర్వ‌హిస్తుంటారు. ఎక్క‌డ నిబంధ‌న‌లు పాటించ‌డం లేదు. సుమారు ముప్ప‌యికి పైగా ప‌డ‌వ‌లు ఉన్నాయి. 

గోదావ‌రి న‌ది మ‌ధ్యలో ఉన్న ఇసుక దిబ్బ‌ల వ‌ద్ద కూడా హెచ్చ‌రికా బోర్డులు లేవు. గ‌జ ఈత‌గాళ్లు కూడా లేరు. భక్తుల భద్రత దృష్ట్యా బాసర వద్ద గోదావ రిలో పడవల సంచారంపై నిషేధం విధిస్తూ భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నదిలో పడవలను తిప్పరాదని పడవలు నడిపే వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.

బాసర ఆలయానికి గత రెండు సంవత్సరాలుగా రెగ్యులర్ ఈవోను నియమించక పోవడంతో పర్యవేక్షణ కరువైంది. ఆలయంతో పాటు గోదావరి నది తీరం పరిసర ప్రాంతాలలో పరిశుభ్రత, భద్రత చర్యలపై పర్యవేక్షించే వారు లేకపోవడం తో భక్తులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కీస‌ర ఆల‌య ఈఓ సుధాక‌ర్ రెడ్డిని ఇక్క‌డ ఇన్‌చార్జి బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

బాస‌ర పుణ్య‌క్షేత్రం స‌మీపాన గోదావ‌రిలో రెండు రోజుల కింద‌ట ప్ర‌మాదానికి గురై ఐదుగురు మృతి చెందిన సంఘ‌ట‌న‌పై న్యాయవాది ఇమ్మానేని రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్సీ)లో పిటీషన్‌ దాఖలు చేశారు.  బాసరలో అధికారుల‌ నిర్వహణ లోపం, అడుగడుగునా నిర్లక్ష్యం కారణంగా ఐదు నిండు ప్రాణాలు బలైనట్టు ఆయన తన పిటిషనలో పేర్కొన్నారు. రెండు రోజుల కింద‌ట మృతుల కుటుంబాల‌కు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. పిటిషన్‌ స్వీకరించిన కమిషన్‌ ఘటనపై కేసు నమోదు చేసిన‌ట్లు స‌మాచారం.