
మద్యం కుంభకోణంలో వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్యెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన బాల్య మిత్రుడు, హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం చేసే వెంకటేష్ నాయుడులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ శ్రీలంక పారిపోయే ప్రయత్నం చేయగా బెంగళూరు విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం బెంగళూరు వెళ్లి వారిద్దరినీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఏ-38గా ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డిని ఏ-39గా, వెంకటేశ్‌నాయుడును ఏ-34గా సిట్ చేర్చింది. సిట్ కధనం మేరకు మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్మును రాజ్ కెసిరెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచీ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి చేరేవేసేవారు.
చెవిరెడ్డి తన దగ్గర పనిచేసే కొందరు పీఏలు, గన్మెన్లు, డ్రైవర్లు, ఇతర అనుచరులు, పలువురు సన్నిహితులను హైదరాబాద్, బెంగళూరుల్లోని పలు ప్రాంతాలకు పంపించి ఈ ముడుపుల సొత్తును రాజ్ కెసిరెడ్డి బృందం నుంచి వసూలు చేసుకునేవారు. ఇలా దాదాపు రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల మేర ముడుపుల సొత్తు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి చేరింది.
ఆ మొత్తాన్ని తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్ సహా అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న కలెక్షన్ పాయింట్ల వద్ద నిల్వ చేసుకున్న చెవిరెడ్డి సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజులు ముందు 5 జిల్లాలోని వైఎస్సార్సీపీ అభ్యర్థులకు చేరవేశారు. ఆ సొమ్మునే వారు ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసినట్లు సిట్ దర్యాప్తులో గుర్తించింది.
ముడుపుల సొమ్మును రాజ్ కెసిరెడ్డి బృందం నుంచి కలెక్ట్ చేసుకునేందుకు అప్పట్లో చెవిరెడ్డి ఛైర్మన్‌గా ఉన్న తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా వాహనాలను వాడుకున్నట్లు గుర్తించారు. ఆ నగదే చంద్రగిరిలో ఓటర్లకు సైతం ఆయన పంపిణీ చేశారని భావిస్తున్నారు. ఇందుకోసం చెవిరెడ్డి అప్పటి పీఏ, గన్‌మెన్, డ్రైవర్లు, ఇతర సన్నిహితులను ఉపయోగించుకున్నారు.
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గన్‌మెన్‌గా పనిచేసిన ఏఆర్ కానిస్టేబుల్ మదన్‌రెడ్డిని సిట్ విచారణకు పిలిచిన తరువాత ఇక తప్పించుకోవడం సాధ్యం కాదని చెవిరెడ్డి ఓ నిర్ణయానికొచ్చి, ముందు శ్రీలంకకు, అక్కడి నుండి వేరే దేశాలకు పారిపోవాలని బెంగుళూరు విమానాశ్రయంకు చేరిన్నట్లు భావిస్తున్నారు.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ