భాష‌ల ఆధారంగా దేశాన్ని విభ‌జించ‌లేం

భాష‌ల ఆధారంగా దేశాన్ని విభ‌జించ‌లేం

భార‌త్ ఆకాంక్ష‌ల‌తో కూడుకున్న దేశ‌మ‌ని, భాష‌ల ఆధారంగా విభ‌జ‌న జ‌ర‌గ‌డం స‌రికాదని ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌ర్ హితవు చెప్పారు. దేశ భ‌విష్య‌త్తుల‌ను దృష్టిలో పెట్టుకుని, భాషా వివాదం నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల్ని కోరారు. జాతీయ విద్యా విధానం 2020ని క‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని పేర్కొంటూ ఆ విధానం విద్యా వ్య‌వ‌స్థ‌లో గేమ్‌ఛేంజ‌ర్‌గా మారుతుంద‌ని చెప్పారు. 

పాండిచ్చ‌రి వ‌ర్సిటీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ కొంద‌రు భాష‌ల‌ను వ్య‌తిరేకిస్తున్న‌ట్లు తెలిపారు. గ‌త ద‌శాబ్ధంలో అద్భుత‌మైన ప్ర‌గ‌తి జ‌రిగింద‌ని, దీని వ‌ల్ల భార‌త్ ఆకాంక్ష‌ల దేశంగా మారింద‌ని ఆయ‌న చెప్పారు. భాష‌ల ఆధారంగా ఎలా విభ‌జిస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. భాష‌ల అంశంలో ఏ దేశం కూడా భార‌త్ అంత సంప‌న్నంగా లేవ‌ని స్పష్టం చేశారు. 

దేశంలో కొంత మందికి ఇతర భాషలు అంటే వ్యతిరేకత ఉందని విచారం వ్యక్తం చేశారు. “గత దశాబ్ధకాలంలో జరిగిన అసాధారణ అభివృద్ధి ఫలితంగా భారత్ ప్రపంచంలోనే అత్యంత ఆకాంక్షాత్మక దేశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశాన్ని భాష పేరిట ఎలా విభజించగలుగుతాం?” అని ఆయన ప్రశ్నించారు.

సంస్కృత భాష‌కు విశ్వ‌వ్యాప్తంగా ప్రాముఖ్య‌త ఉంద‌ని, త‌మిళం, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, ఒడియా, మ‌రాఠీ, పాలీ, ప్రాకృతి, బెంగాలీ, అస్సామీతో పాటు 11 క్లాసిక‌ల్ బాష‌లు ఉన్న‌ట్లు చెప్పారు. పార్ల‌మెంట్‌లో 22 భాష‌ల్లో చ‌ర్చ‌లు చేప‌ట్టేందుకు స‌భ్యుల‌కు అవ‌కాశం ఉంద‌ని గుర్తు చేశారు. మ‌న భాష‌లు స‌మ‌గ్ర‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని, ఐక‌మ‌త్యం కోసం స‌నాత‌నం అదే బోధిస్తుంద‌ని ధ‌న్‌ఖ‌ర్ తెలిపారు. 

ఆత్మ ప‌రిశోధ‌న చేసుకోవాల‌ని, దానికి త‌గిన‌ట్లు వృద్ధి కావాల‌ని సూచించారు. మ‌న ల‌క్ష్యాల‌ను తెలుసుకుని, భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని, భాషా వివాదం నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని చెప్పారు. ఎన్ఈపీ పాల‌సీని అమ‌లు చేయాల‌ని రాష్ట్రాల‌ను కోరారు. మ‌న అబ్బాయిలు, అమ్మాయిలు ఆ ల‌బ్ధిని పొందాల‌ని చెబుతూ రాజ‌కీయ నాయ‌కులు ఎన్ఈసీ పాల‌సీకి భంగం క‌లిగించ‌వ‌ద్దని హితవు చెప్పారు.

“జాతీయ విద్యా విధానంలో ఏమి ఉందో గ్రహించాలి. దీనిని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన అబ్బాయిలు, అమ్మాయిలు వర్క్షాప్ల ద్వారా ఈ జాతీయ విద్యా విధానం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి” అని ఉపరాష్ట్రపతి సూచించారు.

రాజ్యాంగ నిర్మాతలు భాషల విషయంలో రాజకీయ ఘర్షణలు అవసరం లేకుండా విధానాన్ని రూపొందించారని చెబుతూ ఇందులో ఎలాంటి గందరగోళం లేదని అందరూ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. “జాతీయ విద్యావిధానం ప్రపంచంలోనే అత్యుత్తమ విధానం. ఇది విద్యార్థులు తమ ప్రతిభను, సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి, ఒకటి కంటే ఎక్కువ కోర్సులు నేర్చుకోవడానికి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశాన్ని అందిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.