
కేంద్ర ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అ ధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై సమర్పించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ (పీఎఫ్‌ఆర్)ను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పారు. బనకచర్లపై తెలంగాణ నుంచి లేవనెత్తిన అంశంపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒక నివేదిక కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు, సెంట్రల్ వాటర్ కమిషన్‌కు ఇచ్చిందని తెలిపారు.
జల ఒప్పందాలపై విధానాలు, నిబంధనలు, నదులపై ఉన్న మార్గదర్శకాలు, అనేక రాష్ట్రాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సెంట్రల్ వాటర్ కమిషన్ సమగ్రంగా పరిశీలన జరుపుతుందని వెల్లడించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
అయితే కొంతమంది దుందుడుకు విధానంతో కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారంటూ బీజేపీపై విమర్శలు చేయడం సమంజసం కాదని తెలిపారు. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎటువంటి సమాచార మార్పిడి జరగలేదని, ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకోవాల్సిన అవసరం ఉందని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభిస్తున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని చెబుతూ భేషజాలు లేవు, బేసిన్ల గొడవ లేదు, అపోహలు లేవు, వివాదాలు అక్కర్లేదు, వివాదాలే కావాలంటే మరో తరానికి కూడా మనం నీళ్లు ఇవ్వలేము’ అని అన్న సంగతిని గుర్తు చేశారు.
గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుంచి మూడు టీఎంసీల నీరు తన్నుకుపోతున్న సమయంలో కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉండి స్పందించలేదని ధ్వజమెత్తారు. కాళేశ్వరం విషయంలో అప్పుడు, ఇప్పుడూ బీజేపీ ఒకే మాట చెబుతోందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో దోపిడీ జరిగిందని, ఆర్థికంగా, సాంకేతికంగా ఈ ప్రాజెక్టు సాధ్యసాధ్యాల పరంగా అనేక అనుమానాలు ఉన్నాయని తెలంగాణ ఇరిగేషన్ రంగానికి చెందిన నిపుణులు అప్పుడే చెప్పారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం అవినీతిపై సీబీఐ దర్యాప్తు కోరాం, ఇప్పుడు కూడా అదే డిమాండ్ చేస్తున్నామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
గడచిన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిన షెడ్యూల్ ఇప్పటికే దాటిపోయి చాలా ఆలస్యం అయ్యిందని పేర్కొంటూ తక్షణమే ఎన్నికల నోటిఫకేషన్ జారీ చేసి ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి స్వతంత్రంగా, సంపూర్ణంగా పాల్గొని అన్ని స్థానాల్లో కూడా పోటీ చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నూతన యువతను స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సమగ్ర విచారణ జరిగి దోషులకు శిక్షపడేలా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ బీజేపీ తరఫున రాష్ట్రహైకోర్టులో పిటిషన్ వేశామని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా హైకోర్టు తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన ప్రజావ్యతిరేక చర్యలపై సీబీఐ విచారణ జరపాలని సుద్దపూసలా మాట్లాడుతూ ఉత్తరం రాసిందని గుర్తు చేస్తూ మరి ఇప్పుడు ఆ మాటలు ఎటుపోయాయని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. గత ప్రభుత్వం హైకోర్టుకు సూచించినట్లు న్యాయవాదుల ఫోన్లు, అనేక మంది వ్యాపారస్తులు, సినిమా నటులు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయని తెలిపారు.
చివరకు తనతో పాటు బీజేపీ ఆఫీసులో పనిచేసే సిబ్బంది, బీజేపీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొందని గుర్తు చేశారు. ఈ పరిస్థితిలో వాస్తవాలను విచారించేందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించామని వివరించారు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము