పశ్చిమాసియా ఉద్రిక్తలు, ట్రంప్‌ టారిఫ్‌లపై జి7 చర్చ

పశ్చిమాసియా ఉద్రిక్తలు, ట్రంప్‌ టారిఫ్‌లపై జి7 చర్చ
ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ దాడులు, మరోవైపు గాజాలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధం, రష్యా, ఉక్రెయిన్‌ దాడులు ఇలా పశ్చిమాసియా వ్యాప్తంగా ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న వేళ జి-7 పూర్తి స్థాయి సదస్సు సోమవారం ఆరంభమైంది. ఈ పరిస్థితుల్లో పశ్చిమాసియా పరిణామాలు, మరోవైపు చైనా, కెనడా సహా పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన టారిఫ్‌లపై సదస్సులో ప్రధానంగా చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. 

ఈ ఏడాది చర్చల అనంతరం జి-7 దేశాల నేతల సంయుక్త డిక్లరేషన్‌ లేదు. ఈసారి సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రధాని మోదీ, ఉక్రెయిన్‌ అద్యక్షుడు జెలెన్‌స్కీ హాజరవుతున్నారు. సైప్రస్‌లో పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రానికి కెనడా చేరుకున్నారు. కెనడా ప్రధాని మార్క్‌ కార్నే ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ హాజరయ్యారు. దశాబ్దకాలంలో మోదీ కెనడాలో తొలిసారిగా పర్యటిస్తున్నారు.

కాగా కొత్త ఆయుధాల కొనుగోలుపై జెలెన్‌స్కీ, ట్రంప్‌తో చర్చించనున్నారు. మంగళవారం సదస్సుకు హాజరు కానున్న జెలెన్‌స్కీ, ఉక్రెయిన్‌ కొనుగోలు చేయనున్న రక్షణ ప్యాకేజీపై చర్చించనున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌లో యుద్ధంపై మంగళవారం ప్రధానంగా చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. ఇదిలా వుండగా, కెనడా ప్రధాని మార్క్‌ కార్నేతో సోమవారం ఉదయం ట్రంప్‌ భేటీ అయ్యారు. 

వాణిజ్యం, భద్రతపై ప్రధానంగా చర్చలు జరుగుతాయని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలొని, జర్మనీ ఛాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌తో భేటీ అయ్యారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ అందరికన్నా ముందుగానే కనానాస్కిస్‌ చేరుకున్నారు.

కాగా, ప్రధాని మోదీకి నిరసన తెలియచేసేందుకు వందలాదిమంది ఖలిస్తానీలు అల్బర్టా చేరుకుంటున్నారు. ఇందుకు గానూ వారు వస్తున్న వాహనాల కాన్వారు దృశ్యాలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ‘పొంచి వుండి మోదీపై దాడిచేయడానికి, ప్రధాని మోదీ రాజకీయాలను నాశనం చేసేందుకు తాను సిద్ధంగా వున్నానని నిరసన నేతల్లో ఒకరైన మన్‌జిందర్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ అనే సంస్థ ఈ నిరసనలను చేపట్టింది.