భారత్‌కు సైప్రస్ ఒక విశ్వసనీయ భాగస్వామి

భారత్‌కు సైప్రస్ ఒక విశ్వసనీయ భాగస్వామి
భారత్‌కు సైప్రస్ ఒక విశ్వసనీయ భాగస్వామి అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆ దేశ వ్యాపారవేత్తలతో  సైప్రస్ అధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడౌలిడెస్‌ తో కలిసి పాల్గొంటూ భారత్, సైప్రస్ మధ్య పరస్పర వాణిజ్యం 150 మిలియన్ డాలర్లకు చేరుకుందని, కానీ ఇరుదేశాల సంబందాల సామర్థ్యం దీని కంటే చాలా ఎక్కువ అని ప్రధాని మోదీ చెప్పారు.

 భారత్‌లో ఇంధనం, సాంకేతికత వంటి రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని వ్యాపారవేత్తలకు మోదీ సూచించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా గత పదేళ్ల కాలంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చామని చెప్పారు. గత దశాబ్దంలో ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని అన్నారు. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా చాలా వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్​కు స్పష్టమైన విధానం ఉందని వెల్లడించారు. 

యూపీఐ కారణంగా, నేడు ప్రపంచంలోని డిజిటల్ లావాదేవీలలో 50 శాతం భారత్​లోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఫ్రాన్స్ వంటి దేశాల మాదిరిగానే సైప్రస్​ యూపీఐలో చేర్చడానికి చర్చులు జరుగుతున్నాయని, దానిని స్వాగిస్తున్నట్లు మోదీ అన్నారు.  ఇక రెండు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని సైప్రస్‌కు వెళ్లడం ఇదే మొదటిసారి. ఆదివారం సైప్రస్‌ చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశాధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడౌలిడెస్‌ సాదర స్వాగతం పలికారు.

ప్రధాని మోదీ బస చేసిన హోటల్‌ వద్ద ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. వారితో ప్రధాని మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. ఆ తర్వాత వాణిజ్య ప్రముఖులతోనూ ప్రధాని మోదీ సమావేశమయ్యారు. సైప్రస్‌ పర్యటన అనంతరం ప్రధాని మోదీ కెనడా వెళ్లి, జీ7 సదస్సుకు హాజరు కానున్నారు. అక్కడి నుంచి క్రొయేషియా పర్యటనకు వెళ్తారు. ఆపరేషన్ సిందూర్ తరువాత ప్రధాని మోడీ విదేశీ పర్యటన చేపట్టడం ఇదే మొదటిసారి.

ఉభయదేశాల ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకు ఈ పర్యటన చేపట్టారు. 15, 16 తేదీలలో రెండు రోజుల పర్యటనకు సైప్రస్ వచ్చిన మోదీకి దేశాధినేత క్రిస్టోడౌలిడెస్ ఘన స్వాగతం పలికారు. ఆపరేషన్ సింధూర్ తరువాత ప్రధాని మోదీ ఇక్కడికి రావడంతో ఇరువురు నేతల మధ్య ప్రధానంగా ఉగ్రవాద వ్యతిరేక చర్యలపైనే చర్చలు ఉంటాయని భావిస్తున్నారు.  టర్కీ మరికొన్ని దేశాలు పాక్‌తో వంతపాడుతూ భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ప్రధాని మోదీ సైప్రస్ నేతకు తెలియచేయనున్నారు.