అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపాలని ఇరాన్ ఇప్పటికే రెండు సార్లు విఫల ప్రయత్నాలు చేసిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సంచలన ఆరోపణలు చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హత్యకు మాస్టర్ ప్లాన్ వేసింది ఇరాన్ అని పేర్కొంటూ ట్రంప్‌ను తమ అణు ఆశయాలకు ప్రభుత్వ ప్రధాన ముప్పుగా ఇరాన్ భావించడమే అందుకు కారణమని పేర్కొన్నారు.
టెహ్రాన్ టార్గెట్ ట్రంపేనని, ఆ దేశానికి ప్రథమ శత్రువు అమెరికా అధ్యక్షుడేనని చెప్పారు. ఇజ్రాయెల్- ఇరాన్ పరస్పర దాడుల నేపథ్యంలో నెతన్యాహూ మాట్లాడుతూ ట్రంప్ నిర్ణయాత్మక నాయకుడు, బలహీనమైన రీతిలో బేరసారాలు చేయడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడరని, ప్రత్యర్థికి లొంగిపోరని స్పష్టం చేశారు. గతంలో జరిగిన నకిలీ అణుఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు, 2020లో అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ టాప్ జనరల్ ఖాసీం సోలేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ ప్రయత్నించిందని, అందుకే ట్రంప్ ను లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొన్నారు.
అమెరికా నిఘా సంస్థలు ముందుగానే గుర్తించడంతో ప్రమాదం తప్పిందని చెప్పుకొచ్చారు. అయితే, నెతన్యాహు ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. కాగా, ఈ విషయాన్ని అమెరికా దర్యాప్తు సంస్థలు ధృవీకరించలేదు. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదని చాలా స్పష్టంగా చెప్పారని, అంటే వారు యురేనియంను శుద్ధి చేయకూడదని, ఈ నేపథ్యంలో ట్రంప్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు.
కాగా, ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఇరాన్ అణు కార్యక్రమాలు చేపడుతున్నదని నెతన్యాహూ ఆరోపించారు. తమ దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని చాలావరకు వెనక్కి నెట్టాయని చెప్పారు. ప్రపంచ దేశాలన్నింటికీ ఇరాన్ పెనుముప్పుగా మారుతున్నదని ఆయన హెచ్చరించారు. అందుకే, దాడులు చేయడం తప్ప తమకు మరో అవకాశం లేకుండా పోయిందని తెలిపారు.
ముప్పును సమూలంగా తొలగించేంతవరకు తమ పోరాటం ఆగదని, ఇజ్రాయెల్ తనను తానే కాకుండా ప్రపంచాన్ని కూడా రక్షిస్తున్నదని చెప్పారు. కాగా, తమ దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ కజేమీ, ఆయన డిప్యూటీ జనరల్ హసన్ మహాకిక్ చనిపోయారని నెతన్యాహూ వెల్లడించారు. ఐఆర్‌జీసీ నిఘా విభాగానికి చెందిన మరో కీలక అధికారిని కూడా మట్టుబెట్టినట్లు తెలిపారు. ఐడీఎఫ్ వైమానిక దాడుల్లో ఇప్పటికే రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధిపతి కూడా మరణించిన విషయం తెలిసిందే.

More Stories
భారత్, అమెరికాల మధ్య 10 ఏళ్ల రక్షణ ఒప్పందం
చాబహార్ పోర్ట్‌పై అమెరికా ఆంక్షల నుండి తాత్కాలిక ఊరట
అమెరికాలో వర్క్ పర్మిట్ ఆటోమేటిక్ రెన్యువల్ రద్దు