
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల్లో ఎక్కువగా సత్యనారాయణస్వామి వ్రతం చేయించుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో ఆలయ దేవస్థాన అధికారులు సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్ ధరను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
యాదాద్రి ఆలయంలో నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్ ధరను పెంచుతూ ఈవో వెంకట్రావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు యాదాద్రిలో సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్ ధర రూ.800 ఉండగా, దాన్ని రూ.1000కి పెంచారు. ఇప్పటివరకు ఉన్న టికెట్‌పై రూ.800 చెల్లించి వ్రతం టికెట్ తీసుకుంటే భక్తులకు పూజా సామాగ్రి అందించేవారు.
అయితే ఇప్పుడు యాదాద్రి దేవస్థానం వ్రతం టికెట్ ధరను రూ.1000కి పెంచగా, ఇకపై ఈ టికెట్ మీద భక్తులకు పూజ, ఇతర సామగ్రితో పాటుగా స్వామివారి శేష వస్త్రాలు అలానే సత్యనారాయణ స్వామి ప్రతిమను కూడా ఇవ్వనున్నారు. పెరిగిన టికెట్ ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి.
పైగా, భక్తులకు అందించే ఉచిత ప్రసాదాన్ని 100 కిలోల నుంచి 300 కిలోలకు పెంచుతూ యాదాద్రి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి ఉచిత ప్రసాదం ట్రయల్ ను దేవస్థానం ప్రారంభించింది . దీనిలో భాగంగా జూన్ 30వ తేదీ వరకు ప్రతి రోజు భక్తులకు 300 కేజీల లడ్డూ, 300 కిలోల పులిహోరను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత జులై 1 నుంచి ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వెల్లడించారు.
More Stories
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు
హైదరాబాద్ శివార్లల్లో గోసంరక్షకులపై కాల్పులు:
ఫీజు బకాయిలు చెల్లించకపోతే సచివాలయం ముట్టడి!