రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అర్బన్ నక్సల్స్ కు పెద్దపీట!

రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అర్బన్ నక్సల్స్ కు పెద్దపీట!
ఇటీవల జరిగిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల  బదిలీలలో, అంతకు ముందు జరిగిన పలు నామినేటెడ్ పోస్టుల భర్తీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అర్బన్ నక్సల్స్ ప్రాధాన్యత పొందుతున్నారని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డా. సోలంకి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన అధికార నియామకాల్లో విద్యా రంగం సహా అనేక బాధ్యతల్ని అర్బన్ నక్సలైట్ భావజాలం కలిగిన వ్యక్తులకే ఇచ్చినట్లుగా స్పష్టమవుతోందని ఆరోపించారు.

ప్రభుత్వ నియామకాల్లో వైస్ చాన్సలర్లు, విద్యా కమిషన్ వంటి కీలక పదవులతో పాటు  కోదండరాం లాంటి వారు అదేకోవలో నియామకమైనవారే అని విమర్శించారు. .అర్బన్ నక్సలైట్ భావజాలం కలిగిన వారిని  సంతృప్తిపర్చడం కోసమే ప్రభుత్వ నిర్ణయాలు, నియామకాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణ సినీ కళాకారులకు గద్దర్ పేరుమీద అవార్డులు ఇవ్వడం కూడా అందులో భాగమే అని స్పష్టం చేశారు.  
తెలుగు సినీ ప్రముఖులు కూడా ఈ అవార్డుల విషయంలో పునరాలోచన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేపటి తరానికి ఈ అవార్డు విశిష్టత ఏంటని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం ఏంటి? అని ప్రశ్నించారు.  రాహుల్ గాంధీ చెప్తే రేపటి రోజున యాకుబ్ మెమన్, అజ్మల్ కసబ్ లాంటి వాళ్ల పేరుమీద కూడా అవార్డులు ఇస్తరేమో? అని ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్ మంత్రివర్గంలోని ఒక మంత్రి కూడా ఆ భావజాలాన్ని సమర్థిస్తూ ఆపరేషన్ కగార్ ను  నిలిపివేయాలని మాట్లాడుతున్నారని విస్మయం వ్యక్తం చేశారు.  
నక్సలైట్లను భారత చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (1967) ప్రకారం ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించిందే కాంగ్రెస్ ప్రభుత్వం (2010లో) అని గుర్తు చేశారు.  1981లో ఇంద్రవెల్లిలో గిరిజనులపై కాల్పులు జరిపిన పార్టీ కూడా కాంగ్రెస్ అని పేర్కొంటూ ఇప్పుడు అదే పార్టీ గిరిజన సంక్షేమంపై మాట్లాడటం ద్వంద్వ వైఖరికి నిదర్శనం అని ధ్వజమెత్తారు.  ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ కూడా 2009లో యుపిఎ  హయాంలోనే ప్రారంభమైందని చెప్పారు.  ఇప్పుడు కాంగ్రెస్ నేతలు వీటిని విమర్శించడమంటే, తమ స్వంత పాలనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లే అవుతుందని హెచ్చరించారు.

గద్దర్ అవార్డులు పేరుతో రాజకీయ లక్ష్యాలను నెరవేర్చే ప్రయత్నం చేయడం, ప్రముఖులను వేదికగా వినియోగించడం దురుద్దేశపూరితమైనదని స్పష్టం చేశారు. అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనబోయే సినీ ప్రముఖులు ఒకసారి పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని డా. శ్రీనివాస్ హితవు చెప్పారు.  “రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్న” అని చెప్పిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని తక్కువ చేయడమే అవుతుందని ఆయన మండిపడ్డారు.  
తెలంగాణ ప్రజలు తనకు ఇచ్చిన అవకాశాన్నిరాహుల్ గాంధీకి ఊడిగం చేయడానికి  కాకుండా,  ప్రజలకు సేవ చేయడం మొదటి బాధ్యత ఇవ్వాలని ముఖ్యమంత్రికి సూచించారు.
ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతూ, మరోవైపు మంత్రులు హెలికాప్టర్లలో తిరిగే దుర్బర పాలన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని విమర్శించారు. నిజంగా బడ్జెట్ కష్టాల్లో ఉన్న ప్రభుత్వం అయితే ఈ విధమైన దుబారా, అనవసర అవార్డుల కార్యక్రమాలు, హంగామాలు మానేయాలని స్పష్టం చేశారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే ఎలా మెరుగుపర్చుకోవాలో పనిచేయాలి. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ కోసం ఊడిగం చేసే దాంట్లో కనీసం 10 శాతం దీనిపై ఆలోచన చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడేది. కేవలం కొంతమందిని సంతృప్తిపర్చడానికో, కాలయాపనకో కాకుండా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచించాలని సూచించారు.