అణు ఒప్పందంపై ఇరాన్ కు ట్రంప్ గట్టి హెచ్చరిక

అణు ఒప్పందంపై ఇరాన్ కు ట్రంప్ గట్టి హెచ్చరిక
 
* పరిస్థితి చేయి దాటకముందే చర్చలు జరపండి
ఇకనైనా తమతో అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం ఇచ్చారు. పరిస్థితి చేయి దాటకముందే తమతో చర్చలు జరపాలని హెచ్చరించారు. దాడులతో విపరీత పరిణామాలే తప్ప సాధించేదేమీ ఉండదని, ఇకనైనా అమెరికాతో అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇరాన్‌కు హితవు పలికారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడుల అనంతరం ట్రంప్‌ సోషల్‌ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.

‘‘నేను ఎన్ని చెప్తున్నా కొందరు ఇరాన్‌ నేతలు పట్టించుకోకుండా ధైర్యంగా మాట్లాడుతున్నారు. కానీ భవిష్యత్‌లో ఏం జరుగుతుందో వారికి కూడా తెలియదు. ఇరాన్‌లో ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. భారీ విధ్వంసం జరిగింది. ఈ మారణహోమం మరింత దారుణంగా మారొచ్చు. పరిస్థితులు చేయి దాటకముందే ఇరాన్ మాతో ఒప్పందం చేసుకోవాలి’’ అని ట్రంప్ సూచించారు. 

తాను చెప్పినట్లు చేస్తే ఇక మరణాలు, విధ్వంసాలు ఉండవని ఆయన వ్యాఖ్యానించారు. తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్‌కు ఒక అవకాశం తర్వాత మరో అవకాశం ఇస్తూ వచ్చానని ట్రంప్ గుర్తు చేశారు. ఇరాన్‌ తో అణు సమస్యను దౌత్య మార్గాల్లో పరిష్కరించుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఇప్పటికే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా అణు ఒప్పందంపై ఇరాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు.

తమతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ఎన్నిసార్లు సూచించినా టెహ్రాన్‌ అంగీకరించలేదని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని అత్యుత్తమ, అత్యంత ప్రాణాంతకమైన సైనిక పరికరాలను అమెరికా తయారు చేస్తోందని, అందులో చాలామటుకు ఇజ్రాయెల్‌ వద్ద ఉన్నాయని ట్రంప్‌ వెల్లడించారు.  వాటిని ఎలా ఉపయోగించాలో కూడా ఇజ్రాయెల్‌కు తెలుసని, ఆ తర్వాత పరిస్థితి తాను ఊహించిన దానికంటే దారుణంగా ఉంటుందని హెచ్చరించారు.
ఇరాన్‌లో ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారని, భారీ విధ్వంసం జరిగిందని, ఈ మారణహోమం మరింత దారుణంగా మారడానికి కొంత సమయం పడుతుందని, పరిస్థితులు చేయి దాటకముందే ఇరాన్ తమతో అణు ఒప్పందం చేసుకోవాలని సూచించారు.  ఇరాన్‌‌పై ఇజ్రాయెల్‌ దాడి గురించి ఓ మీడియా సంస్థ ప్రతినిధి ట్రంప్‌ను ప్రశ్నించగా, ఇజ్రాయెల్ దాడులు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. 
తాము అవకాశాలు ఇచ్చినా ఇరాన్‌ వాడుకోలేకపోతోందని విచారం వ్యక్తం చేశారు. తాము ఇచ్చే ఆఫర్లను ఎన్నిసార్లు తిరస్కరిస్తే, అంతే తీవ్రతతో పశ్చిమాసియా ప్రాంతంలో పర్యవసానాలు ఉంటాయని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగే సైనిక ఘర్షణలో అమెరికా భాగమవుతుందా అని ట్రంప్‌ను అడగగా, ‘‘దీనిపై నేను ప్రస్తుతానికి స్పందించాలని అనుకోవడం లేదు’’ అంటూ వెళ్లిపోయారు.