
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే గుజరాత్ ప్రభుత్వం, పౌరవిమానయాన శాఖ సంయుక్తంగా స్పందించాయని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే మంటలార్పి, మృతదేహాలను అక్కడి నుంచి తరలించామని పేర్కొన్నారు. దుర్ఘటనపై విచారణకు ఐదుగురు సభ్యులతో ఓ ఉన్నతస్థాయి కమిటీ వేశామని చెప్పారు.
ఇటీవలి కాలంలో దేశంలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, మూల కారణాలను వెలికితీయడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యం అని తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)కు చెందిన సీనియర్ అధికారులతో పాటు ఇతర సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని, ప్రమాద కారణాలను నిగ్గు తేల్చేందుకు వీరు అంతర్జాతీయ సంస్థల నిపుణులతో కలిసి పనిచేయనున్నారని వివరించారు.
భవిష్యత్ లో ఇటువంటి ప్రమాదాల జరగకుండా చూస్తామని చెబుతూ దీనికోసం అనుభవజ్ఞులైన వారితో ఒక సలహా కమిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తమకు ప్రయాణీకుల భద్రతే తొలి ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. అందుకే ప్రస్తుతం నిర్వహణలో ఉన్న అన్ని విమానాల స్థితిగతులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అన్ని విమాన యాన సంస్థలను కోరామని చెప్పారు.
ఇక కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉన్నతస్థాయి కమిటీ రాబోయే కొద్ది వారాల్లో ప్రాథమిక వాస్తవ నివేదికను సమర్పించే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదంలో నా తండ్రిని కోల్పోయానని, ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని పేర్కొంటూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు ఎన్‌ఏ పరీక్షలు వేగంగా జరుగుతున్నాయని, మృతదేహాలను వీలైనంత తొందరగా అందజేస్తామని తెలిపారు.
ఈ ప్రమాదంపై హోం శాఖ సెక్రటరీ అధ్యక్షతన హైలెవల్ కమిటీతో దర్యాప్తు చేయిస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రత్యేక అధికారులతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఈ కమిటీలో ఉన్నారని చెప్పారు. నిపుణుల దర్యాప్తు పూర్తయిన వెంటనే మీడియాకు సమాచారం అందిస్తామని పేర్కొన్నారు. బోయింగ్ 787 సిరీస్ విమానాల భద్రతపై దర్యాప్తునకు ఆదేశించామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రస్తుతం 34 బోయింగ్-787 విమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో ఏడు విమానాల భద్రతపై సమీక్ష జరిగిందని చెప్పారు. అంతేకాకుండా ఈ సిరీస్‌ను తరచూ తనిఖీ చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు.
కాగా, దర్యాప్తు బృందాలు ఇప్పటికే విమానానికి చెందిన రెండు బ్లాక్ బాక్స్ లను (ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్ పిట్ వాయిస్ రికార్డర్) స్వాధీనం చేసుకున్నాయి. వీటిలో ఒకటి స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, దాని నుంచి సమాచారాన్ని సేకరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. విమానం కూలిపోవడానికి ముందు జరిగిన సంఘటనల క్రమాన్ని అర్థం చేసుకోవడంలో ఈ ఫ్లైట్ రికార్డర్ల నుంచి లభించే సమాచారం అత్యంత కీలకమని భావిస్తున్నారు. సాంకేతిక లోపం, విమానం రెక్కల ఫ్లాప్ సెట్టింగ్‌లు లేదా డేటా ఇన్‌పుట్‌లో పొరపాట్లు, వాతావరణ పరిస్థితుల ప్రభావం వంటి అనేక కోణాల్లో దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు.
ఇక, ఈ దర్యాప్తు ప్రక్రియలో అంతర్జాతీయ సహకారం కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికాకు చెందిన నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్‌టీఎస్‌బీ) నిపుణులు ఇప్పటికే భారత అధికారులతో కలిసి ఆధారాలను పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. అలాగే అంతర్జాతీయ విమానయాన నిబంధనల ప్రకారం, కెనడాకు చెందిన ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (టీఎస్‌బీ) కూడా ఒక నిపుణుడిని ఈ దర్యాప్తు పురోగతిని పర్యవేక్షించేందుకు నియమించింది.
More Stories
వక్ఫ్ సవరణ చట్టంలో రెండు నిబంధనల అమలు నిలిపివేత
ఆసియా కప్ 2025లో పాక్ ను మట్టికరిపించిన భారత్
మహిళల నేతృత్వంలో అభివృద్దే `వికసిత భారత్’కు పునాది