
అహ్మదాబాద్ సమీపంలో గురువారం జరిగిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ప్రమాదంలో 240 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఎయిరిండియా రూ.1,000 కోట్ల పైగా బీమా క్లెయిమ్‌లకు దరఖాస్తు చేయనుందని భావిస్తున్నారు. ఇది భారత బీమా రంగంలోనే అతి పెద్ద చెల్లింపుగా మారవచ్చని తెలుస్తోంది.
ప్రయాణీకుల మరణాలు, థర్డ్ పార్టీ నష్టాలకు క్లెయిమ్‌లు నమోదు చేయడానికి వీలుందని బీమా పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విమాన నష్టం, ప్రయాణీకుల మరణాలు, థర్డ్ పార్టీ నష్టాల బాధ్యత భారీగా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ బీమా క్లెయిమ్ దేశంలోని మొత్తం విమానయాన రంగం బీమా రంగానికి సేకరించిన మొత్తం వార్షిక ప్రీమియం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
20 బిలియన్ డాలర్లు ఏవియేషన్ ఇన్సూరెన్స్ ప్రోగ్రాంలో ఎయిరిండియా తన విమానాలకు బీమా చేసింది. టాటా ఎఐజి గ్లోబల్ కన్సోరియంగా ఇతర భారత బీమా కంపెనీలైనా ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అస్యూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లు ఇందులో ఉన్నాయి. ఈ సంస్థలు సంయుక్తంగా ప్రస్తుత ప్రమాదానికి చెల్లింపులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజా దుర్ఘటనతో రెండు ప్రభుత్వ రంగ బీమా సంస్థల షేర్లు పతనమయ్యాయి. శుక్రవారం న్యూ ఇండియా అస్యూరెన్స్ షేర్ 2.37 శాతం నష్టపోయి రూ.186.85 వద్ద ముగియగా, జనరల్ ఇన్సూరెన్స్ 0.56 శాతం తగ్గి రూ.391.85 వద్ద నమోదయ్యింది.
”విమాన నష్టం ఏవియేషన్ హల్ ఆల్ రిస్క్ విభాగం కిందకు వస్తుంది. విమానం విలువను దాని విడిభాగాలు, పరికరాలతో పాటు బీమా పరిధిలోకి వస్తాయి. 2013లో విటి ఎబిఎన్ డ్రీమ్‌లైనర్ డెలివరీ చేయబడినప్పటికీ ఈ ప్రమాదానికి గురైన విమానానికి 2021లో 115 మిలియన్ డాలర్ల (రూ.900 కోట్లు పైగా) బీమా చేయబడింది” అని భీమా వర్గాలు చెబుతున్నాయి.
“నష్టం పాక్షికమైనా లేదా మొత్తమయినా, విమానయాన సంస్థ ప్రకటించిన విలువ ఆధారంగా నష్టం కవర్ చేయబడుతుంది. విమానం విలువ సహా మరణించిన ప్రయాణీకులకు పరిహారం, థర్డ్ పార్టీ నష్టాలను బీమా సంస్థలు భరించాల్సి ఉంటుంది.” అని ఆ వర్గాలు పేర్కొన్నారు.
మాంట్రియల్ కన్వెన్షన్ అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి సుమారు రూ.1.5 కోట్ల వరకు బీమా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎయిర్ ఇండియా కొనుగోలు చేసిన బీమా కవరేజీపై ఆధారపడి వాస్తవ చెల్లింపు ఉంటుంది. విమానం నివాస గృహాలపై కూలిపోవడంతో, విమానయాన సంస్థకు థర్డ్ పార్టీ ఆస్తి నష్టం బాధ్యత కూడా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు మొత్తంగా సుమారు రూ.360 కోట్ల పరిహారం అందవచ్చని అంచనా. ”విమానం వయసు, తయారీని బట్టి సుమారు రూ.680-980 కోట్లు ఉండొచ్చు” అని తెలుస్తున్నది. దీని ప్రకారం ఎయిర్ ఇండియా నష్టపోయిన విమానానికి భారీ మొత్తంలో బీమా పరిహారం లభించనుందన్నారు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!