బోయింగ్ 787-8 విమానాలను గ్రౌండింగ్‌ చేసే యోచన!

బోయింగ్ 787-8 విమానాలను గ్రౌండింగ్‌ చేసే యోచన!

బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానాల గ్రౌండింగ్‌ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమానం కూలిన ప్రమాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశమ్నుట్లు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం తెలిపాయి. పాత కాలం నాటి బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానాలను నిలిపివేసే విషయంలో భారత్‌, అమెరికా ఏజెన్సీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు పేర్కొన్నాయి.

ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఎయిర్ ఇండియా విమానాల నిర్వహణ, ఆపరేటింగ్ విధానాలను కూడా లోతుగా పరిశీలించిన తర్వాతే బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానాల గ్రౌండింగ్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు వివరించాయి.

మరోవంక, జెనెక్స్​ ఇంజిన్​లతో నడిచే ఎయిర్ ఇండియా బోయింగ్​ 787 డ్రీమ్​లైనర్ విమానాల భద్రతా తనిఖీని మరింత పెంచాలని జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం ఆదేశించింది. ప్రమాదం జరిగిన విమానం జెనెక్స్​ ఇంజిన్​తో నడవడంతో దీనిపై ఇన్​స్పెక్షన్​కు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.  టాటా గ్రూప్​ యాజమాన్యంలో ఎయిర్ ఇండియా ఉంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఫ్లీట్​లో 26 బోయింగ్​787-8 విమానాలు, 7 బోయింగ్​ 787-9లు ఉన్నాయి.

ఈ విమానాల్లోని వివిధ వ్యవస్థలను తనిఖీలు చేయాలని, కచ్చితంగా టేకాఫ్ పారామితులను సమీక్షించాలని ఏవియేషన్ వాచ్​డాగ్​ డీజీసీఏ స్పష్టం చేసింది. జెనెక్స్ ఇంజిన్​లతో నడితే బోయింగ్ 787-8, బోయింగ్​ 787-9 విమానాల విషయంలో అదనపు నిర్వహణ చర్యలను తక్షణమే అమలు చేయాలని ఎయిర్​ ఇండియాను డీజీసీఏ ఆదేశించింది. అంతేకాదు ఈ చర్యలను డీజీసీఏ ప్రాంతీయ కార్యాలయాలతో సమన్వయంతో నిర్వహించాలని స్పష్టం చేసింది.

అలాగే హైడ్రాలిక్ వ్యవస్థ సర్వీస్​బిలిటీ చెక్​, టేకాఫ్ పారామీటర్స్​ను తనిఖీ చేయాలని డీజీసీఏ ఆదేశించింది. డీజీసీఏ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, తదుపరి నోటీస్ వచ్చే వరకు ట్రాన్సిట్​ ఇన్​స్పెక్షన్ చేయాలి. అలాగే రెండు వారాల్లోపు విద్యుత్ అస్యూరెన్స్ చెక్స్​ చేయాలి. అలాగే “బి787-8/9 విమానాల్లో గత 15 రోజులుగా పునరావృతమైన స్నాగ్​ల సమీక్ష ఆధారంగా నిర్వహణ చర్యలను త్వరగా క్లోజ్ చేయాలి” అని డీజీసీఏ పేర్కొంది. తరువాత ఈ తనిఖీల నివేదికలను సమీక్ష కోసం తమకు సమర్పించాలని డీజీసీఏ స్పష్టం చేసింది.