సైప్రస్‌ లో తొలిసారి పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీ

సైప్రస్‌ లో తొలిసారి పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీ
 
* కెనడాలో జి7 సదస్సులో పాల్గొననున్న ప్రధాని
 
ప్రధాని నరేంద్రమోదీ సైప్రస్‌ లో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడౌలైడ్స్‌ ఆహ్వానం మేరకు ప్రధాని జూన్‌ 15, 16 తేదీల్లో సైప్రస్‌లో ప్రధాని మోదీ అధికారిక పర్యటన ఉండనుంది. కాగా గడిచిన రెండు దశాబ్దాల్లో భారత ప్రధాని సైప్రస్‌ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సైప్రస్‌ అధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడౌలైడ్స్‌తో భేటీ కానున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై ఆ సమావేశంలో చర్చించనున్నారు.
ఈ సందర్భంగానే ప్రధాని కెనడాలో జరుగుతున్న జీ7 సదస్సుకు ప్రధాని హాజరుకానున్నారు.  అనంతరం క్రొయేషియాలో కూడా పర్యటించనున్నారు. మొత్తం ఐదు రోజులపాటు సైప్రస్‌, కెనడా, క్రొయేషియా దేశాల్లో మోదీ పర్యటన కొనసాగనుంది. కెనడాలో రేపటి నుంచి మూడు రోజుల పాటు 15 నుండి 17 వరకు జీ7 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీకి కెనడా నుంచి గతవారం ఆహ్వానం అందించింది. ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ మోదీకి ఫోన్‌ చేసి సదస్సుకు రావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే, భారత్‌-కెనడా మధ్య నెలకొన్న విభేదాల కారణంగా జీ 7 సమ్మిట్‌కు ప్రధాని మోదీ దూరంగా ఉంటారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయన హాజరవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు స్పష్టత ఇచ్చాయి.

కాగా, ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ పరిణామాల నేపథ్యంలో జీ7 సదస్సు కీలకంగా మారింది. ఈ సదస్సులో ఇరాన్- ఇజ్రాయెల్ వివాదంపై ప్రధాని చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చర్చల ద్వారా ప్రస్తుత వివాదానికి పరిష్కారం చూపాలని మోదీ కోరనున్నట్లు సమాచారం. అంతేకాదు ఇటీవలే పాక్‌పై భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ గురించి కూడా ప్రపంచ నాయకులతో ప్రధాని చర్చించనున్నట్లు తెలిసింది.