విమాన ప్రమాద ఘటనలో బ్లాక్‌ బాక్స్‌ లభ్యం

విమాన ప్రమాద ఘటనలో బ్లాక్‌ బాక్స్‌ లభ్యం

గుజరాత్లోని అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్సు లభ్యం అయ్యింది. ప్రమాదం జరిగిన 27 గంటల తరువాత ఈ బ్లాక్ బాక్స్ను ఓ భవనం పైకప్పు పై గుర్తించినట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) తెలిపింది.  ప్రమాద ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా దీనికి గల కారణాలు అంతుచిక్కలేదు.

సాంకేతిక లోపమా? పక్షులు ఢీకొనడంతోనే ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందా? అసలు ఏం జరిగింది? అనే విషయాలపై పౌర విమానయాన శాఖకు స్పష్టత రాలేదు. ఈ క్రమంలో ప్రమాద కారణాలను అన్వేషించేందుకు జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) అధికారులు రంగంలోకి దిగారు. అదేవిధంగా ఏఏఐబీ అధికారులు విచారణ ప్రారంభించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం  వైమానిక రంగ నిపుణులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని కూడా నియమించింది.

ఈ కమిటీ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ రూపొందించిన ప్రోటోకాల్‌ ప్రకారం విచారణ చేస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించేందుకు అన్ని కోణాల్లోనూ విచారణ చేయనున్నట్టు చెప్పారు. అదేవిధంగా వైమానిక రంగం భద్రత, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలనే అంశాలపై కూడా ఉన్నత స్థాయి కమిటీ దృష్టిసారిస్తుందని వివరించారు. 

ఎన్‌ఐఏ అధికారులు సహా కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే ఇతర ఏజెన్సీలకు చెందిన అధికారులు కూడా అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. అయితే, వారు ఏయే అంశాలపై దృష్టి పెట్టారు? ఏకోణంలో విచారణ చేపట్టారనే విషయాలను గోప్యంగా ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40 మంది, సిబ్బంది పౌరవిమానయాన శాఖ బృందాలతో కలిసి పనిచేస్తున్నట్లు ఏఏఐబీ వెల్లడించింది. విమాన ప్రమాదాల్లో బ్లాక్‌ బాక్స్‌ కీలకం అన్న విషయం తెలిసిందే. ఇది ఆరెంజ్‌ కలర్‌లో ఉంటుంది. 

కాగా, విమానం, హెలికాప్టర్ల ప్రమాదం జరిగేకంటే కనీసం రెండు గంటల ముందు ఏం జరిగిందన్న వివరాలను ఈ బ్లాక్‌బాక్స్‌ స్టోర్‌ చేసుకుంటుంది. విమానాలు క్రాష్‌ అయినా ఇందులోని సమాచారం తొలగిపోదు. ప్రమాదానికి గల కారణం, ప్రమాదానికి ముందు ఏం జరిగింది.. తదితర సమాచారం అంతా ఈ బ్లాక్‌ బాక్సులో నిక్షిప్తమై ఉంటుంది.  ఈ సమాచారం ద్వారా ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తారు.

భవిష్యత్తు ప్రమాదాలను నిరోధించడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తులో ఈ బ్లాక్ బాక్స్ అత్యంత కీలకం. అందుకే ఇది దొరికిన వెంటనే విమాన ప్రమాద దర్యాప్తు బృందం ఈ బ్లాక్ బాక్స్ విశ్లేషణను ప్రారంభించింది. ప్రతి కమర్షియల్‌ విమానంలో 2 బాక్స్‌లు ఉంటాయి. అందులో ఒకటి విమానం డేటాను రికార్డ్‌ చేస్తుంది. మరొకటి కాక్‌పిట్‌ వాయిస్‌ను రికార్డ్ చేస్తుంది.