భారత్ – చైనాల మధ్య నేరుగా విమానాల పునరుద్ధరణ

భారత్ – చైనాల మధ్య నేరుగా విమానాల పునరుద్ధరణ
భారత్‌- చైనాల మధ్య నేరుగా విమాన సేవల పునరుద్దరణను వేగవంతం చేయడానికి అంగీకారం కుదిరింది. ఈ విషయాన్ని ఇరు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు శుక్రవారం ప్రకటించాయి. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి సన్‌ వీడాంగ్‌, కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీల మధ్య సమావేశం తరువాత ఈ విషయాన్ని ప్రకటించారు.
 
ఇరు దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరుచుకుంటున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. “ఇరు దేశాల మధ్య వివాదాలను, విభేదాలను పరిష్కరించుకోవాలని, అంతర్జాతీయ, ప్రాంతీయ శాంతి, స్థిరత్వాలను కాపాడుకోవడంలో సంయుక్తంగా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం” అని చైనా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 
 
అలాగే భారత మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో “ఇరు దేశాల మధ్య సంబంధాలను స్థిరీకరించడానికి, పునర్నిర్మించడానికి సమావేశంలో అంగీకారం కుదరింది” అని తెలిపింది. కాగా, హిమాలయ సరిహద్దు వెంబడి పెట్రోలింగ్‌కు సంబంధించి ఇరు దేశాలు గత అక్టోబర్‌లో ఒక ఒప్పందానికి వచ్చాయి. దీంతో రెండు దేశాల మధ్య 2020లో ప్రారంభమైన ప్రతిష్టంభన తొలగిపోయింది. తరువాత వాణిజ్యం, సాంకేతికత, విమాన ప్రయాణం వంటి రంగాల్లో ఒప్పందాలపై భారత్‌- చైనా దృష్టి పెట్టాయి.