చిన్న పిల్లల్లో వచ్చే డయేరియాకు భారత్ బయోటెక్ టీకా

చిన్న పిల్లల్లో వచ్చే డయేరియాకు భారత్ బయోటెక్ టీకా

చిన్న పిల్లల్లో బ్యాక్టీరియా వల్ల వచ్చే డయేరియాకు టీకాను అభివృద్ధి చేయటానికి బహుళజాతి ఫార్మా కంపెనీ జీఎస్​కే పీఎల్​సీతో భారత్​ బయోటెక్​ ఇంటర్నేషనల్​ లిమిటెడ్​ జట్టు కట్టింది. తద్వారా షిగెల్లా టీకా క్యాండిడేట్​ అయిన ఆల్ట్​సోన్​ఫ్లెక్స్​ 1-2-3 అభివృద్ధిలో కీలకమైన భాగస్వామి అవ్వనుంది. ఆల్ట్​సోన్​ఫ్లెక్స్​ 1-2-3పై నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో ఎంతో సానుకూల ఫలితాలు వచ్చాయి. 

ఆఫ్రికా దేశాల్లో నిర్వహించిన రెండో దశ పరీక్షల్లో భద్రతపరంగా ఎటువంటి సవాళ్లు కనిపించలేదు. నిర్దేశిత వ్యాధి నిరోధకతనూ ఈ టీకా ప్రదర్శించినట్లు స్పష్టమైంది. ఆల్ట్​సోన్​ఫ్లెక్స్​ 1-2-3 టీకా క్యాండిడేట్​ను జీఎస్​కే ఆవిష్కరించింది. ఈ టీకాను అభివృద్ధి చేసి, పూర్తిస్థాయి టీకాగా రూపుదిద్దే పనిలో ఇకపై భారత్​ బయోటెక్​ భాగస్వామి అవ్వనుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లైసెన్స్ పొందిన షిగెల్లా టీకా ఏదీ లేదు.

ప్రస్తుతానికి క్లినికల్​ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి టీకాగా గుర్తింపు పొందే అవకాశం ఆల్ట్​సోన్​ఫ్లెక్స్​ 1-2-3 టీకా క్యాండిడేట్​కే కనిపిస్తోంది. ఇది అత్యాధునికమైన జనరలైజ్డ్​ మాడ్యూల్స్​ ఫర్​ మెంబ్రేన్​ యాంటీజెన్స్​ – జీఎంఎంఏ టెక్నాలజీ ప్లాట్​ఫామ్​ మీద రూపుదిద్దుకుంటోంది. వ్యాధి నిరోధకత సాధించడం కోసం బ్యాక్టీరియాలోని బాహ్య మెంబ్రేన్​ల ద్వారా వ్యాధి నిరోధక వ్యవస్థకు ఓ-యాంటీజెన్​ పంపించడం ఈ సాంకేతిక పరిజ్ఞానంలోని ఒక ప్రత్యేకత.

అత్యాధునిక టీకాను ఆవిష్కరించటానికి తాము సిద్ధమవుతున్నట్లు భారత్​ బయోటెక్​ ఇంటర్నేషనల్​ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​ డాక్టర్​ కృష్ణ ఎల్ల తెలిపారు. తద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చిన్న పిల్లల ప్రాణాలు కాపాడగలమని ఆయన పేర్కొన్నారు. ఈ టీకా క్యాండిడేట్‌పై మూడో దశ క్లినికల్‌ పరీక్షలను భారత్‌ బయోటెక్‌ చేపట్టనుంది. ఆ తర్వాత అవసరమైన అనుమతులు తీసుకొని టీకాను భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తుంది.