దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్యలో వివాహం జరిగిన రెండు వారాలకే భర్తను అత్యంత కిరాతకంగా భార్య హతమార్చడం దేశంలో పతనం అవుతున్న వైవాహిక బాంధవ్యాలను ప్రతిబింబిస్తుంది. గృహ హింసపెరుతో భార్యలను వేధింపులకు గురిచేయడం, చివరకు హత్యలకు కూడా పాల్పడటం మనం చాలాకాలంగా చూస్తున్నాము.
కానీ ఇటీవలకాలంలో భార్యలే తమ వివాహేతర సంబంధాలను కప్పుకుచ్చుకోవడం కోసం లేదా వాటిని కొనసాగించడంకోసం అకారణంగా భర్తలను కిరాతకంగా హతమారుస్తున్న సంఘటనలు దేశవ్యాప్తంగా తరచూ జరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
హనీమూన్ కోసమని భర్త రాజా రఘువంశీతో కలిసి మేఘాలయ వెళ్లిన భార్య సోనమ్ రఘువంశీ పక్కా ప్లాన్‌తోనే అక్కడే అతడిని అతి కిరాతకంగా హత్య చేయడం గురించి గత కొద్దీ రోజులుగా మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. అయితే, పోలీసులు వారిని విచారిస్తున్న సమయంలో ఇంకా చాలా అనుమానాలు, ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ అసలు ఆమె ప్రియుడు కాదని తెలుస్తోంది.
స్థానికుల సమాచారం ప్రకారం, రాజ్ సోనమ్‌ను ‘దీదీ’ అని పిలిచేవాడట. సోనమ్ కూడా అతడికి చాలా సార్లు రాఖీ కట్టేదట. వీరిద్దరికీ ఎలాంటి రిలేషన్ లేదని స్థానికులు అంటున్నారు. అయితే, వీళ్లిద్దరికీ నిజంగా ఎలాంటి సంబంధం లేకపోతే, సోనమ్ తన భర్తను ఎవరి కోసం చంపింది? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. కేవలం రాజ్‌ను అడ్డుపెట్టుకుని భర్తను చంపించిందని, అసలు ప్రియుడు వేరే వ్యక్తి ఉన్నాడని తెలుస్తోంది. మరింత లోతుగా దర్యాప్తు జరగాల్సి ఉంది.
ఏదేమైనా ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా కట్టుకొన్న భాగస్వామిని కడతేరుస్తున్న ఘటనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ-సోనమ్ ‘బ్లడీ హనీమూన్’ ఉదంతం వైవాహిక బంధాలు, అక్రమ సంబంధాలపై మరోసారి చర్చను తీసుకొస్తున్నది. బెంగళూరులో టెకీగా పనిచేస్తున్న హరిణి అనే 33 ఏండ్ల వివాహితను ఓ వ్యక్తి 13 సార్లు పొడిచి పొడిచి చంపాడు. అతనెవరో కాదు.. బాధితురాలితో కొన్నేండ్లుగా వివాహితేర సంబంధం కొనసాగించిన వ్యక్తే. అక్రమ సంబంధాన్ని ఇక ముగించివేద్దామని ఆమె చెప్పడంతో కోపోద్రిక్తుడైన అతడు బాధితురాలిని ఇంత దారుణంగా హత్య చేశాడు.
లండన్‌లో పనిచేస్తున్న 24 ఏండ్ల సౌరభ్ రాజ్‌పుత్ తన భార్య ముస్కాన్ రస్తోగీని చూసేందుకు ఈ ఏడాది మొదట్లో మీరట్‌కు వచ్చాడు. అయితే, తన వివాహేతర సంబంధం ఎక్కడ బయటపడిపోతుందోనని భయపడిన ముస్కాన్.. సౌరభ్ తినే అన్నంలో విషం పెట్టి చంపేసింది. తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలసి సౌరభ్ మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో పడేసింది. అనంతరం దానిపై సిమెంటు పోసి మూసేసింది.
హర్యానాకు చెందిన యూట్యూబర్ రవీనా రావు తన వివాహేతర సంబంధం తెలిసిపోయినందుకు తన భర్త ప్రవీణ్‌ని ఆమె గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని ఓ కాలువలో పడేసింది. సీసీటీవీలో ఆమె కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కర్ణాటకలో బ్యూటీ పార్లర్ నడుపుతున్న ప్రతిమ అనే వివాహిత.. తన భర్తను చంపేందుకు తన ప్రియుడు దిలీప్‌తో కలసి కుట్ర పన్నింది. భర్త బాలకృష్ణకు విషం పెట్టి.. అతను స్పృహ కోల్పోగానే ఊపిరాడనీయకుండా చేసి చంపేసింది. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ప్రతిమ, ఆమె ప్రియుడు అరెస్టయ్యారు.
పెండ్లయ్యి రెండు వారాలు గడువక ముందే యూపీలో ప్రగతి అనే వివాహిత తన భర్త దిలీప్‌ను కాంట్రాక్ట్ కిల్లర్‌కు సుపారీ ఇచ్చి కాల్చి చంపించింది. అనురాగ్ అనే బాయ్‌ఫ్రెండ్ కోసమే ఇదంతా చేసింది. కాగా.. పెండ్లికి వచ్చిన నగదు బహుమతిని కిల్లర్‌కు ఆమె ఫీజుగా ఇచ్చింది.
భర్త, ఇద్దరు పిల్లలు, అత్తమామలకు విషం పెట్టి చంపేందుకు ప్రయత్నించిన ఓ 33 ఏండ్ల మహిళను కర్ణాటకలోని హసన్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. హసన్ నివాసి గజేంద్రతో 11 ఏండ్ల క్రితం పైండ్లెన చైత్రకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో తన ప్రియుడు శివూతో కలసి ఆమె తన కుటుంబ సభ్యులకు భోజనంలో నిద్రమాత్రలు కలిపింది. తమపై హత్యా యత్నాన్ని గుర్తించిన ఆమె భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చైత్రను, ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు.
బలహీనమవుతున్న సామాజిక బంధాలు, కుటుంబ సంబంధాలు ఇటువంటి దారుణాలకు దారితీస్తున్నాయి. కుటుంభం బాంధవ్యాలే పునాదిగా నెలకొన్న భారతీయ సంస్కృతికి ఈ పరిణామాలు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. సామాజిక శాస్త్రవేత్తలను సహితం దిక్కుతోచని విధంగా చేస్తున్నాయి.
More Stories
తేజస్వీ సీఎం అయితే కిడ్నాపింగ్, వసూళ్లు, హత్య మంత్రిత్వ శాఖలు
సమాజం ఆర్ఎస్ఎస్ ను ఆమోదించింది.. వ్యక్తులు నిషేధింపలేరు
జూబ్లీ హిల్స్ లో బిజెపి ప్రయత్నాలు ముమ్మరం చేయాలి