జర్నలిస్ట్ కొమ్మినేనికి సుప్రీంకోర్టులో బెయిల్

జర్నలిస్ట్ కొమ్మినేనికి సుప్రీంకోర్టులో బెయిల్
అమరావతిని వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీలో డిబేట్ నిర్వహించిన కేసులో అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు శుక్రవారం  సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సాక్షిలో ప్రసారమైన డిబేట్ విషయంలో కొమ్మినేనిని మందలించిన సుప్రీంకోర్టు ఆయనను విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కింది కోర్టులో బెయిల్ తీసుకోవాలని సూచించింది. బెయిల్ షరతులపై ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది.  
 
కింది కోర్టులో బెయిల్ కోసం కొమ్మినేని దరఖాస్తు చేసుకున్నారు. అయితే అక్కడ ఆయన బెయిల్ పిటీషన్ పెండింగ్‌లో ఉండగానే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ పీకే మిశ్రా ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ, వెంటనే విడుదల చేయాలని ఆదేశాలిస్తూ, మరోసారి అమరావతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయవద్దని కొమ్మినేనికి సుప్రీం ధర్మాసనం సూచించింది. 
 
భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. కింది కోర్టు విధించిన షరతులకు లోబడే బెయిల్ మంజూరు చేస్తున్నామని పేర్కొంది. విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలు ట్రయల్ కోర్టు ఇస్తుందని న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం స్పష్టం చేసింది. 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. చర్చలను గౌరవ ప్రదంగా చేయాలని కోర్టు వ్యాఖ్యానించింది.
సుప్రీంలో దాఖలు చేసిన పిటీషన్ లో కొమ్మినేని పలు అంశాలను ప్రస్తావించారు. 41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసారని పేర్కొన్నారు. లైవ్ షో లో గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారని ప్రస్తావించారు.  కొమ్మినేని కి ఎలాంటి నేర చరిత్ర లేదని వివరించారు. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని పిటీ షన్ లో ఆరోపించారు. చర్చలో భాగంగా గెస్ట్ ను కొమ్మినేని నియంత్రించే ప్రయత్నం చేసారని, వాటిని సమర్ధించలేదని వివరించారు.

కొమ్మినేని అరెస్ట్ పై సుప్రీం కోర్టు అత్యద్భుతమైన తీర్పు ఇచ్చిందని వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్ పై సుప్రీం కోర్టు తీర్పు కూటమి ప్రభుత్వం కు చెంప పెట్టని విమర్శించారు. రాష్ట్రంలో పత్రిక స్వేచ్ఛను హరించే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు సుప్రీం కోర్టు తీర్పు తో బుద్ధి చెప్పిందని తెలిపారు. ఏపీ లో పత్రిక స్వేచ్ఛ ను సర్వనాశనం చేయాలని చూస్తున్న ప్రభుత్వానికి ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. సాక్షి కార్యాలయాలు పై దాడి చేసిన గుండాలు, రౌడీ మూకలను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.