ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడుల పట్ల భారత్ ఆందోళన

ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడుల పట్ల భారత్ ఆందోళన
* 16 ఎయిర్ ఇండియా విమానాలు దారిమల్లింపు/రద్దు

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు భారత్‌ పేర్కొంది. ఈ పరిస్థితిపై విదేశాంగ మంత్రిత్వ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ”ఇరాన్‌, ఇజ్రాయిల్‌ మధ్య ఇటీవలి పరిణామాలపై మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాము. అణు స్థావరాలపై దాడులకు సంబంధించిన నివేదికలతో సహా అక్కడి పరిస్థితిని మేము నిశితంగా పరిశీలిస్తున్నాము. ఉద్రిక్తతలను తీవ్రతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలని భారత్‌ ఇరుదేశాలను కోరుతోంది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. 

ఉద్రిక్తతలను పెంచే చర్యలు నివారించాలని భారత్‌ కోరుతున్నట్లు పేర్కొంది. ఉద్రిక్తతలను తగ్గించడానికి, అంతర్లీనంగా సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే జరుగుతున్న చర్చలు, దౌత్య మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించింది. భారత్‌ రెండు దేశాలతో సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలను కలిగి వుందని, సాధ్యమైన మేర సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని ఎంఇఎ తెలిపింది.

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల్లో నివసిస్తున్న భారత పౌరులను ఉద్దేశించి అక్కడి మన ఎంబసీలు అడ్వైజరీలు కీలక సూచనలు చేశాయి. ఎవరూ అవనసర ప్రయాణాలు చేయొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించాయి. 

 
”ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులంతా అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారులు చెప్పే భద్రతా ప్రమాణాలను పాటించండి. ఎప్పటికప్పుడు ఎంబసీల సోషల్‌ మీడియా ఖాతాలను అనుసరించి తాజా సమాచారం తెలుసుకోండి. అనవసర ప్రయాణాలు చేయొద్దు. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత శిబిరాలకు చేరుకొనేందుకు సిద్ధంగా ఉండండి” అని ఇరాన్‌ ఇజ్రాయెల్‌ లోని భారత దౌత్య కార్యాలయాలు తమ అడ్వైజరీలో పేర్కొన్నాయి.
 
ఇజ్రాయెల్‌ జరిపిన దాడి కారణంగా ఇరాన్‌ తమ గగనతలాన్ని శుక్రవారం మూసివేయడంతో ముంబై నుంచి లండన్‌ వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం ఏఐ131ను అత్యవసరంగా దారి మళ్లించాల్సి వచ్చింది. అలాగే, మొత్తం 16 విమానాలను ఎయిరిండియా దారి మళ్లించడమో, వెనక్కి పిలిపించడమో చేసినట్టు సమాచారం.  లండన్‌ వెళ్లాల్సిన ఓ ఎయిరిండియా విమానం కొన్ని గంటలకే వెనక్కి మళ్లింది.
ముంబయి ఎయిర్‌పోర్టు నుంచి శుక్రవారం తెల్లవారుజామున 5.39 గంటలకు ఎయిరిండియా ఏఐసీ129 విమానం లండన్‌ బయల్దేరింది. మూడు గంటల పాటు గాల్లో ఉన్న ఆ విమానం తిరిగి ముంబయికి చేరుకుంది. దీంతో, ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇరాన్‌ తన గగనతలాన్ని మూసివేయడంతో పలు దేశాలకు చెందిన విమాన సర్వీసులపై ఈ ప్రభావం పడింది. అనేక విమాన సర్వీసులకు దారి మళ్లిస్తున్నారు. ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానాలను కూడా దారి మళ్లిస్తున్నట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్బంగా ఎయిర్‌ ఇండియా స్పందిస్తూ..’ ఊహించని అంతరాయం కారణంగా ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. ప్రయాణీకులకు వసతి కల్పించడంతో సహా అన్ని వసతులు కల్పలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది.