16న విచారణకు కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు

16న విచారణకు కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు
ఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు ఈ నెల 16 ఉదయం 10 గంటలకు  విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి గత నెల మే 28న విచారణకు హాజరుకావాల్సిందిగా మే 26వ తేదీన కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు పంపింది. 
 
అయితే ఆ సమయంలో కేటీఆర్ అమెరికా, యుకె పర్యటనకు వెడుతున్నందున  విదేశీ పర్యటన ముగిసిన తర్వాత విచారణకు హాజరువుతానని ఏసీబీకి మాజీ మంత్రి సమాచారం ఇచ్చారు. దానికి అంగీకారం తెలిపిన ఏసీబీ తాజాగా మరోసారి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.  కారు రేసింగ్ కేసులో జనవరి 9న మాజీ మంత్రి కేటీఆర్‌ స్టేట్‌మెంట్‌ను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు.
 
కేటీఆర్ ఇచ్చిన సమాచారం, ఇతరుల విచారణలో వెలుగు చూసిన అంశాలను క్రోడీకరించి తుది దశ దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగానే కేటీఆర్​ను రెండో సారి విచేరించేందుకు నోటీసులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో 55 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. 
 
ఈ ఏసీబీ కేసులో ముగ్గురు పేర్లను ఎఫ్ఐఆర్​లో చేర్చింది. ఏ1గా మాజీమంత్రి కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఏడాది జనవరి 8న సీనియర్ ఐఏఎస్ అర్వింద్‌ కుమార్, జనవరి 9 మాజీమంత్రి కేటీఆర్, జనవరి 10న హెచ్‌‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్‌‌‌‌ బీఎల్‌‌ఎన్‌‌ రెడ్డి, జనవరి 18న గ్రీన్‌‌కో ఏస్‌‌ నెక్స్ట్‌‌జెన్‌‌ ఎండీ చలమలశెట్టి అనిల్‌‌కుమార్​లను ఏసీబీ అధికారులు విచారణ చేశారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులను, సీఈవోను జూమ్ మీటింగ్‌‌ ద్వారా వర్చువల్‌‌గా అధికారులు విచారణ చేసి సమాచారాన్ని సేకరించారు.