మంత్రుల శాఖల కేటాయింపులో రేవంత్ రెడ్డికి భంగపాటు

మంత్రుల శాఖల కేటాయింపులో రేవంత్ రెడ్డికి భంగపాటు
 
ఒక వంక మంత్రివర్గ విస్తరణలో తన మాట నెగ్గించుకోలేక పోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చివరకు కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపులో సహితం చుక్కెదురైనట్లు తెలుస్తున్నది.  అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి మూడు రోజులపాటు ఢిల్లీలో ఉన్నా భంగపాటు తప్పలేదని చెబుతున్నారు.  ఇద్దరు మంత్రులకు చెందిన ముఖ్య శాఖలను మార్చాలని సీఎం భావించగా ఢిల్లీ పెద్దలు ఒప్పుకోలేదని, పైగా తన దగ్గర ఉన్న కీలక శాఖలకే వదులుకోవలసి వచ్చిమదని చెప్పుకుంటున్నారు.
అందుకే వివేక్‌ వెంకట స్వామికి గనుల శాఖను కేటాయించాల్సి వచ్చిందన్న ప్రచారం జరుగుతున్నది.  శాఖల మార్పుపై తన మాట నెగ్గకపోవడంతో సీఎం  తనకు ఎదురైన భంగపాటును కప్పిపుచ్చుకునేందుకు విశ్వప్రయత్నం చేసినట్లు కనిపిస్తున్నది.  గడ్డం వివేక్ వెంకటస్వామికి మైనింగ్, కార్మికశాఖలను, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలను, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, క్రీడలు, యువజన శాఖలను కేటాయిస్తూ బుధవారం రాత్రి  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
తాను అసలు శాఖల కేటాయింపు గురించి ఢిల్లీ రాలేదని,  తెలంగాణలో జరిగిన కులగణనను కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంకు వివరించేందుకు వచ్చానని సీఎం రేవంత్‌ రెడ్డి  చెప్పడం కేవలం మంత్రుల శాఖల కేటాయింపులో ఎదురైన భంగపాటుకు కప్పిపుచ్చుకునేందుకే అని స్పష్టం అవుతుంది.  డిప్యూటీ సీఎం, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి లేకుండా శాఖల కేటాయింపుపై ఎలా నిర్ణయం తీసుకుంటామని, హైదరాబాద్‌కు వెళ్లి చర్చించి శాఖలు కేటాయిస్తానని సీ ఎం ఢిల్లీలో చెప్పారు.

మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ సమక్షంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లకు కులగణన గురించి ప్రజెంటేషన్‌ ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. అ యితే కాంగ్రెస్‌ విడుదల చేసిన ఫొటోల్లో రా హుల్‌, ఖర్గేతోపాటు కర్ణాటక నేతలు మాత్రమే ఉన్నారు. ఒకవేళ రేవంత్‌ రెడ్డి చెప్పిందే నిజమైతే ఆ ఫొటోల్లో ఆయన ఎందుకు లేరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

 
ఇదే విషయాన్ని ఢిల్లీ విలేకరులు సీఎంను ప్రశ్నించగా, ప్రజెంటేషన్‌ ఇస్తుంటే తాను ఫొటోలో ఎలా ఉంటానంటూ ఎదురు ప్రశ్నించారు. పైగా సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లగా, కర్ణాటక నేతలు మంగళవారం చేరుకున్నట్టు చెప్తున్నారు.  ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఎవరు కలిసినా ఆ ఫొటో కొద్ది సేపటికే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటీవల పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ కుటుంబం కలిసిన ఫొటోలు విడుదల చేయడమే ఇందుకు ఉదాహరణ. మరి రేవంత్‌రెడ్డితో ఫొటో మాత్రం ఎందుకు బయటకు రావడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.