
పాకిస్థాన్ ఉగ్రవాదులకు సురక్షిత ప్రదేశం కాబట్టే అక్కడి మిలిటరీ ఏరియాల్లో ఏళ్లుగా ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్నారని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆరోపించారు. ఆ దేశం ఉగ్రవాదులకు సురక్షితం కాకపోతే ఒసామా బిన్ లాడెన్ అక్కడే ఎందుకు దాక్కుంటాడని ప్రశ్నించారు. అంతర్జాతీయ మీడియా, సమాజం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని తాను ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
ఈయూతో ఉన్నత స్థాయి వాణిజ్య చర్చల కోసం బ్రస్సెల్స్కు వెళ్లిన జైశంకర్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డర్ లయన్, ఈయూ విదేశాంగ చీఫ్ ఖాజా కల్లాస్తో భేటీ అయ్యారు. ఈయూకు భారత్ ఎంతో నమ్మకమైన వాణిజ్య భాగస్వామి అని చెబుతూ 140 కోట్ల భారతీయుల్లో అనేక మంది నైపుణ్యం ఉన్న కార్మికులు ఉన్నారని, చైనా కన్నా భారత్ నమ్మకమైన వాణిజ్య భాగస్వామి అని తెలిపారు.
ఈ క్రమంలోనే పాకిస్తాన్- భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిణామాలపైనా మాట్లాడుతూ భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య సరిహద్దు సమస్య కంటే ఉగ్రవాదమే పెద్ద సమస్య అని ఆయన చెప్పారు. భారత్-పాకిస్థాన్ మధ్య తాజా సంఘర్షణలకు కారణం సరిహద్దు సమస్య కాదని, ఉగ్రవాద సమస్య అని పేర్కొంటూ పాకిస్థాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని విమర్శించారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్థాన్‌పై దాడికి పాల్పడటాన్ని అప్పట్లో అంతర్జాతీయ మీడియా తప్పుపట్టడాన్ని ప్రస్తావిస్తూ పాకిస్థాన్ భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని ఆరోపించారు. “మీకు ఒక విషయం గుర్తు చేయాలని అనుకుంటున్నాను. గతంలో ఒసామా బిన్ లాడెన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయనతో పాటు అనేక మంది అనుచరులు పాకిస్థాన్లోని మిలటరీ స్థావరంలో చాలా ఏళ్లు సురక్షితంగా ఉన్నారు” అని గుర్తు చేశారు.
“ప్రపంచమంతా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే- ఇక్కడ భారత్, పాకిస్తాన్ మధ్య గొడవ సమస్య కాదు. ఇదంతా ఉగ్రవాదంపైనే జరుగుతుంది. భవిష్యత్తులో అదే ఉగ్రవాదం మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది. భారత్కు చాలా ఏళ్లుగా ఓ సమస్య ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది రోజుల్లోనే భారత్ సరిహద్దులను ఆక్రమించుకున్నారు” అని తెలిపారు. “మా దేశంలోని కశ్మీర్లోకి పాకిస్తాన్ ఆక్రమణదారులు వచ్చారు. ప్రపంచంలోనే అనేక దేశాలు ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు దీనికి మద్దతు తెలిపాయి. అవే దేశాలు ఇప్పుడు అంతర్జాతీయ సూత్రాలపై చర్చిద్దామని పిలుపునిస్తున్నాయి” అని జైశంకర్ సూచించారు.
మరోవైపు రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరిని జైశంకర్ పునరుద్ఘాటిస్తూ రెండు వర్గాల మధ్య తలెత్తిన విబేధాలు యుద్ధంతో పరిష్కారం కావని స్పష్టం చేశారు. యుద్ధం నుంచి సమస్యకు పరిష్కారం వస్తుందనే నమ్మకం తమకు లేదని స్పష్టం చేశారు. రష్యాతో పాటు ఉక్రెయిన్తో కూడా తమ దేశానికి బలమైన సంబంధాలు ఉన్నాయని చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నమ్ముతారా? అన్న ప్రశ్నకు జైశంకర్ బదులిస్తూ “భారత్ వాణిజ్య సంబంధాలను ట్రంప్ బలోపేతం చేస్తున్నారు. మా దేశానికి ప్రయోజనం చేకూర్చే ప్రతి సంబంధాలను పెంపొందించుకోవడమే మా లక్ష్యం. ముఖ్యంగా అమెరికాతో సంబంధాలు మాకు చాలా ముఖ్యం. అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారనేది ముఖ్యం కాదు” అని స్పష్టత ఇచ్చారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము