
దాయాది పాకిస్థాన్ ఆపరేషన్ సింధూర్ దెబ్బతో తమ దేశ ఆర్థికాభివృద్ధిని ఫణంగా పెట్టి మరీ ఆయుధాల కొనుగోళ్లపై దృష్టిసారించింది. తాజాగా ప్రవేశపెట్టిన రక్షణ బడ్జెట్‌ను ఏకంగా 20 శాతం పెంచింది. షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం ఆ దేశ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ డిమాండ్లను సంతృప్తి పర్చడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ బడ్జెట్లో రక్షణశాఖకు 9 బిలియన్ డాలర్లను కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 20 శాతం అధికం. ఇదిలావుంటే ప్రభుత్వ ఖర్చులో మాత్రం 7 శాతం కోత విధించింది. ఇక పాకిస్థాన్ పర్యావరణ బడ్జెట్లో కూడా భారీగా కోత విధించింది. పర్యావరణ విపత్తులు ఎదుర్కొనే దేశాల్లో పాకిస్థాన్ ఎనిమిదో స్థానంలో ఉంది. 2022లో ఇక్కడ వరదల కారణంగా 3.3 కోట్ల మంది ప్రభావితంకాగా 15 బిలియన్ డాలర్ల ఆస్తినష్టం జరిగింది.
ఇక్కడ ప్రకృతి విపత్తులు జీడీపీలో 18-20 శాతం వరకు నష్టపర్చే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. కానీ పాకిస్థాన్ మాత్రం ఆయుధ కొనుగోళ్లకే మొగ్గు చూపింది. భారత్ గత నెల 7-10 తేదీల మధ్య చేపట్టిన దాడులవల్ల పాక్ సైన్యం ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా ఆ దేశ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో లోపాలను సరిదిద్దుకోవడం వంటి అవసరాలున్నాయి.
ఇస్లామాబాద్ వినియోగించిన హెచ్‌క్యూ-9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, బైరక్తర్ టీబీ2 డ్రోన్లు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు. దాంతో రావల్పిండి సమీపంలోని నూర్ఖాన్ సహా పలు వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో వ్యూహాత్మక మార్పులను ఆ దేశ సైన్యం మొదలుపెట్టింది. ఈ బడ్జెట్లో పెంచిన నిధులతో ఆపరేషన్ సింధూర్‌లో దెబ్బతిన్న టెర్రర్ క్యాంప్‌లను మళ్లీ పునరుద్ధరించే అవకాశం ఉంది.
ఈ ఏడాది ఆగస్టులో కొనుగోలు చేయనున్న జే-35 స్టెల్త్ జెట్లకు కూడా ఈ నిధులను వెచ్చించనుంది. జే-35 స్టెల్త్ జెట్లను చైనా 50 శాతం డిస్కౌంట్‌పై పాకిస్థాన్‌కు విక్రయిస్తోంది. దీంతోపాటు 400 కిలోమీటర్ల రేంజి ఉన్న పీఎల్-17 క్షిపణులను కూడా పాక్ కొనుగోలు చేయవచ్చు. టైప్ 039బీ జలాంతర్గామి, జిన్హా శ్రేణి ఫ్రిగెట్ వంటివి కూడా పాక్ జాబితాలో ఉన్నాయి.
More Stories
జీఎస్టీ సంస్కరణలతో తగ్గనున్న ఆహార వస్తువుల ధరలు
భారీ సైబర్ దాడితో నిలిచిపోయిన పలు దేశాల విమానాశ్రయాలు
హెచ్-1బీ వీసా రుసుం పెంచడంతో టెక్ సంస్థలు అప్రమత్తం