ట్రంప్ ను లేపేస్తామని అల్ ఖైదా హెచ్చరిక

ట్రంప్ ను లేపేస్తామని అల్ ఖైదా హెచ్చరిక
ఉగ్ర సంస్థ అల్‌ఖైదా అరేబియన్‌ పెనున్సులా విభాగం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా ఆయన కార్యవర్గంలోని కీలక మంత్రులను, శ్వేతసౌధం సిబ్బందిని హతమారుస్తామంటూ ప్రకటించింది. ఇటీవల ఈమేరకు ఆ సంస్థ నాయకుడు సాద్‌బిన్‌ అతేఫ్‌ అల్‌-అవ్లాకీ దాదాపు 30 నిమిషాల నిడివితో ఓ వీడియో విడుదల చేశాడు.  అతడి తలపై అమెరికా 6 మిలియన్‌ డాలర్ల రివార్డును ఇప్పటికే ప్రకటించింది.
 
2024 మార్చిలో అల్‌-అవ్లాకీ ఈ సంస్థకు అధిపతిగా బాధ్యతలు చేపట్టాడు. గాజాలో ఇజ్రాయెల్‌ చేపట్టిన యుద్ధానికి ప్రతీకారం తీర్చుకోవాలని సాద్‌ బిన్‌ అతేఫ్‌ అల్‌-అవ్లాకీ పిలుపునిచ్చాడు. అమెరికాలోని లక్ష్యాలపై దాడులు చేసేందుకు ఎలాంటి హద్దులు లేవని చెప్పాడు.  ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ జేడీ వాన్స్‌, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్‌ హెగ్సె, టెక్‌ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ సహా శ్వేతసౌధంతో సన్నిహిత సంబంధాలున్న ప్రతిఒక్క అధికారిని, నాయకుడిని, వారి కుటుంబాలను, బంధువులను లక్ష్యంగా చేసుకొంటామని అల్‌-అవ్లాకీ హెచ్చరించాడు.

గాజాలో పాలస్తీనా వాసులకు వీరు ఎటువంటి ఆధారం మిగల్చలేదన, అందుకే ఈ స్థాయిలో దాడులు చేయాలని పిలుపునిచ్చాడు. గతంలో అల్‌-అవ్లాకీ అమెరికాలో యూదులపై జరిగిన దాడులను పొగుడుతూ మాట్లాడాడు. వారికి ఎక్కడా సురక్షిత ప్రదేశమంటూ లేకుండా చేయాలన్నాడు. అల్‌ఖైదా అరేబియన్‌ పెనున్సులా సంస్థ యెమెన్‌ కేంద్రంగా పనిచేస్తోంది.

గతంలో ఇది సౌదీ, యెమెన్‌లో వేర్వేరుగా పనిచేసేది. అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ మరణం తర్వాత అత్యంత ప్రమాదకర గ్రూపుగా అల్‌ఖైదా అరేబియన్‌ పెనున్సులా అవతరించింది. సాద్‌ బిన్‌ అతేఫ్‌ అల్‌-అవ్లాకీ ఆ గ్రూపు నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. అతడు గతంలో పలుమార్లు అమెరికాపై దాడికి పిలుపునిచ్చాడు. అతడి తల పైనా రూ.50 కోట్ల రివార్డు ఉంది.

అల్‌ఖైదాలో ఈ పెనెన్సులా విభాగమే అత్యంత చురుగ్గా పనిచేస్తోంది. దీనికితోడు గతంలో ఇది ప్రమాదకర దాడులు నిర్వహించింది. అమెరికా, ఐరోపా దేశాల్లోని లక్ష్యాలపై ఇది గురిపెట్టింది. 2009 అండర్‌వేర్‌ బాంబర్‌ కుట్ర, 2015లో చార్లె హెబ్డోపై దాడి దీని పనే. దీంతో అమెరికా విదేశాంగశాఖ దీనిని ఉగ్రజాబితాలో చేర్చింది.