
తెలంగాణలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఏర్పాటుకు కేంద్రం వద్ద ప్రతిపాదనలు ఉ న్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేస్తోందని తెలిపారు. తెలుగు సెంటిమెంట్, సంస్కృతీ తనకు తెలుసునని, ఒడిశాలో కూడా తెలుగు మాట్లాడే వారు చాలా మంది ఉన్నారని తెలిపారు.
ప్రధాని మోదీ 11 ఏండ్ల పాలనపై బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ‘వికసిత్ భారత్ -అమృత్ కాల్ ’ (సేవ -సుశాసన్ – గరీబ్ కళ్యాణ్) పేరుతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన అనంతరం 11 సంవత్సరాల అభివృద్ధిపై పుస్తక ప్రతిని విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతుందని, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఆరు కోట్ల ఇళ్లు కట్టామని తెలిపారు. మరో రెండు కోట్ల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. తెలంగాణలో వందల కిలోమీటర్ల రైల్వే, జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టామని వివరించారు.
విమానాశ్రయాలకు కూడా అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. నెలనెలా ప్రతి వ్యక్తికి కేంద్రమే ఐదు కిలోల ఉచిత బియ్యం ఇస్తుందని చెప్పారు. సమ్మక్క సారక్క విశ్వ విద్యాలయం, నవోదయ విశ్వ విద్యాలయాలు, ఐఐటీలు ఏర్పాటు చేశామని చెప్పారు. చిరు వ్యాపారులకు ముద్ర యోజన కింద గ్యారంటీ లేకుండా రుణాలు ఇస్తున్నామని చెప్పారు.
కాగా, వికసిత్ భారత్ – అమృత్ కాల్ (సేవ – సుశాసన్- గరీబ్ కళ్యాణ్) కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11,12 తేదీలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రాష్ట్ర బీజేపీ పదాధికారులు వివిధ జిల్లాల్లో పర్యటించి ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాలను ప్రారంభిస్తారని బిజెపి రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు.
జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన అనంతరం ముఖ్య నాయకులు, మేధావులు, వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారని, మీడియా సమావేశంలో కూడా మాట్లాడుతారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ వారితో సూచనలను సలహాలను తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాల్లో, అభివృద్ధి – సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందేలా వారిని, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్లాలన్న దృఢ సంకల్పంతో కార్యక్రమాలను నిర్వహిస్తారని చెప్పారు.
ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు విస్తృతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ రెండు రోజుల పాటు ఏఏ జిల్లాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొంటారో ఆ వివరాలను ప్రేమేందర్‌రెడ్డి వెల్లడించారు.
More Stories
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి
స్థానిక సంస్థల ఎన్నికలు, జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే
పొంగులేటి ఒంటెత్తు పోకడలపైమహిళా మంత్రుల అసహనం