న్యాయమూర్తి ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజల్లో అనుమానాలు 

న్యాయమూర్తి ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజల్లో అనుమానాలు 
ఒక రాజకీయ పార్టీ తరఫున న్యాయమూర్తి ఎన్నికల్లో పోటీ చేయడం న్యాయ వ్యవస్థ స్వేచ్ఛ, నిష్పాక్షికతపై ప్రజలలో అనుమానాలు కల్పించేందుకు దారితీయగలదని  భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ హెచ్చరించారు. ఈ కారణంగానే తాను కాని, తన సహచరులు కాని పదవీ విరమణ తర్వాత ఎటువంటి ప్రభుత్వ పదవులు తీసుకోరాదని బహిరంగంగా ప్రతిజ్ఞ చేశామని సీజేఐ గవాయ్‌ తెలిపారు. న్యాయవ్యవస్థ విశ్వసనీయత పరిరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
 
న్యాయ వ్యవస్థ చట్టబద్ధత, ప్రజా విశ్వాసం కాపాడుకోవడం అనే అంశంపై బ్రిటన్‌ సుప్రీంకోర్టులో జరిగిన రౌండ్‌టేబుల్‌ కాన్ఫరెన్స్‌లో ప్రసంగిస్తూ పదవీ విరమణ చేసిన తర్వాత న్యాయమూర్తులు కొత్త బాధ్యతలు చేపట్టడం గురించి మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన వెంటనే ప్రభుత్వం నుంచి మరో నియామకాన్ని న్యాయమూర్తి చేపట్టడం లేదా ఎన్నికల్లో పోటీ చేసేందుకు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేయడం నైతిక విలువలకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తుతుందని, ప్రజల నుంచి శీల పరీక్షను ఎదుర్కోవలసి వస్తుందని సీజేఐ గవాయ్‌ తెలిపారు.
 
న్యాయ వ్యవస్థలో అవినీతి, దుష్ప్రవర్తనకు సంబంధించిన ఉదంతాలు ప్రజా విశ్వాసంపై ప్రతికూల ప్రభావాన్ని కల్పించి మొత్తంగా న్యాయ వ్యవస్థ నిజాయితీపైన నమ్మకాన్ని దిగజారుస్తాయని స్పష్టం చేశారు. అవినీతికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ అవినీతి, దుష్ప్రవర్తనకు సంబంధించిన ఉదంతాలు వెలుగులోకి వచ్చిన వెంటనే వీటిని దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు తక్షణమే తగిన చర్యలు చేపట్టిందని ఆయన వివరించారు.
 
వ్యవస్థలు ఎంత బలంగా ఉన్నప్పటికీ వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు చెందిన ఉదంతాలకు ఆస్కారం ఉంటున్నదని, ఇటువంటివి న్యాయవ్యవస్థలో కూడా చోటుచేసుకోవడం విచారకరమని ఆయన పికోన్నారు. ఇటువంటి ఘటనలు అనివార్యంగా న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలలో ఉన్న విశ్వాసంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, మొత్తం వ్యవస్థ సమగ్రతపైన విశ్వాసం క్షీణించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
అయితే, ప్రజా విశ్వాసాన్ని తిరిగి నిర్మించుకోవడం త్వరితంగా, పారదర్శకంగా తీసుకునే నిర్ణయాలు, చర్యలపైనే ఆధారపడి ఉంటుందని, భారత్‌లో ఇటువంటి ఘటనలు వెలుగుచూసిన వెంటనే సుప్రీంకోర్టు తక్షణం, తగిన చర్యలు తీసుకుంటున్నదని సీజేఐ స్పష్టం చేశారు. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక నివాసంలో భారీ స్థాయిలో కాలిపోయిన నోట్ల గుట్టలు లభించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీజేఐ గవాయ్‌ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.

కాగా, హైకోర్టులు, సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకాల కోసం ఏర్పడిన కొలీజియం వ్యవస్థను సీజేఐ గవాయ్‌ గట్టిగా సమర్థించారు. 1993 వరకు సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకాలలో ప్రభుత్వానిదే తుది నిర్ణయంగా ఉండేదని ఆయన తెలిపారు. ఆ కాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకంంలో రెండుసార్లు సీనియర్‌ మోస్ట్‌ న్యాయమూర్తులను పక్కనపెట్టి జూనియర్లను సీజేఐగా ప్రభుత్వం నియమించిందని ఆయన చెప్పారు. 

ఇది సాంప్రదాయాలకు విరుద్ధంగా జరిగిందని ఆయన తెలిపారు. న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించి నియామకాలలో న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని కాపాడేందుకే కొలీజియం వ్యవస్థ ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు. కొలీజియం వ్యవస్థపై విమర్శలు ఉండవచ్చని, అయితే న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను పణంగా పెట్టడం వల్ల ఎటుంటి పరిష్కారం లభించదని సీజేఐ తెలిపారు.