ఇరాన్ తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరకా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒమన్ రాజధాని మస్కట్ లో జరిగిన పరోక్ష సమావేశంలో చర్చలు కొనసాగించాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. దాంతో ఈ విషయంలో తొలి అడుగు పడింది. అయితే అణుఒప్పందానికి సంబంధించి అమెరికా నుంచి వచ్చిన తొలి ప్రతిపాదన పట్ల ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వ్యతిరేకత వ్యక్తం చేశారు.
దేశంలో 100 న్యూక్లియర్ పవర్‌ప్లాంట్లు ఉన్నా దేశం సుసంపన్నం కాకుంటే అవి ఉపయోగపడవని, మళ్లీ నిధుల కోసం అమెరికా ముందు చేయిచాచాల్సి వస్తుందని పేర్కొన్నారు. అయితే అమెరికాతో అణు ఒప్పందాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు మాత్రం ఖమేనీ పేర్కొనలేదు. అణు ఒప్పందంపై చర్చలు జరుగుతున్నప్పటికీ యూఎస్ ప్రతిపాదన గురించి మాత్రం ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.
అయితే ఆక్సియోస్ అనే వార్తా వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం ఇరాన్ తన చుట్టు పక్కల దేశాలతో కలిసి యురేనియం శుద్ధి కోసం ఒక కన్సార్టియంను ఏర్పాటు చేయాలని అమెరికా ప్రతిపాదించింది. కానీ దీనివల్ల టెహ్రాన్‌కు ఎంత నష్టం వాటిల్లుతుందనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఇరుదేశాల మధ్య ఒప్పందం విఫలమైతే ఇప్పటికే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మరింత పతనమయ్యే అవకాశం ఉంది.
మరోవైపు మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోకుండా నిలువరించేందుకు కొద్దికాలంగా అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి అణుఒప్పందం కుదుర్చుకోవడానికి ట్రంప్ సంసిద్ధత వ్యక్తంచేశారు. దీనిపై ఇటీవల ఒమన్‌లో ఉన్నతస్థాయి చర్చలు కూడా జరిగాయి.
ఈ చర్చలు నిర్మాణాత్మకంగా జరిగి ఫలవంతం అయ్యాయని చర్చల్లో పాల్గొన్న అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ పేర్కొన్నారు. న్యూక్లియర్ డీల్ కుదరకపోతే సైనిక చర్యలకు దిగుతామంటూ ట్రంప్ హెచ్చరికలు కూడా చేశారు. ఇరాన్ అణుకేంద్రాలపై దాడులు చేయడానికి ఇజ్రాయెల్ కూడా ఎదురుచూస్తోందని అన్నారు. ఇరాన్‌తో గతంలో అణుఒప్పందం చేసుకున్న అమెరికా.. 2018లో ట్రంప్ హయాంలోనే దాని నుంచి వైదొలిగింది.

More Stories
ప్రజల కేంద్రీకృత మార్పులకై వాతావరణ సదస్సులో భారత్ పిలుపు
రక్షణ వ్యయం పెంపుపై జి7 దేశాల మధ్య విబేధాలు
ప్రజాస్వామ్యం పునరుద్ధరిస్తే స్వదేశంకు హసీనా సిద్ధం!