
అమెరికా చర్యలు టారిఫ్‌ల తగ్గింపు ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయని చైనా మండిపడింది. ఎఐ చిప్ ఎగుమతుల నియంత్రణపై మార్గదర్శకాలను జారీ చేయడం, చైనాకు చిప్ డిజైన్ సాప్ట్‌వేర్‌ను నిలిపివేయడం మరియు చైనా విద్యార్థి వీసాలను రద్దు చేయాలన్న నిర్ణయించడం వంటి చైనా ప్రయోజనాలకు హాని కలిగించే చర్యలని మండిపడింది. ఈ చర్యలు ఏకాభిప్రాయాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇరుదేశాల మధ్య నిలిచిపోయిన వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించేందుకు ఇటీవల భారీ సుంకాలను తగ్గించడానికి అంగీకరించిన చైనా-అమెరికా ఉమ్మడి ప్రకటనను వాణిజ్య శాఖ ప్రస్తావించింది. ”అమెరికా ఏకపక్షంగా కొత్త ఆర్థిక మరియు వాణిజ్య ఘర్షణలను రెచ్చగొట్టింది. ద్వైపాక్షిక ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాలలో అనిశ్చితి మరియు అస్థిరతను మరింత తీవ్రతరం చేసింది” అని వాణిజ్యశాఖ ప్రకటనలో పేర్కొంది.
చైనా తన నిబద్ధతకు కట్టుబడి ఉందని తెలిపింది. తన చట్టబద్దమైన హక్కులు మరియు ప్రయోజనాలను కాపాడుకోవడానికి ధృడమైన నిశ్చయంతో బలమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. ఈ చర్యలకు తగిన ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికాను హెచ్చరించింది.
గతవారం ట్రంప్ అమెరికాలో చదువుతున్న చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. చైనా నుండి 2,75,000మందికి పైగా విద్యార్థులు అమెరికా క్యాంపస్‌ల్లో చదువుతున్నారు. జెనీవాలో ఉన్నత అధికారుల మధ్య జరిగిన చర్చల తర్వాత బీజింగ్, వాషింగ్టన్ గత నెలలో 90 రోజుల పాటు ఒకరిపై ఒకరు విధించుకున్న అధిక సుంకాలను తగ్గించుకునేందుకు అంగీకరించాయి. చైనా ఒప్పందాన్ని నెమ్మదిస్తోంది అని అమెరికా వాణిజ్య కార్యదర్శి హౌవార్డ్ లుట్నిక్ పేర్కొనడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.
More Stories
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్