ప్రమాదకరమైన బయోలాజికల్ ప్యాథోజన్ ను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు చైనీయులను అమెరికా అరెస్టు చేసింది. పరిశోధన కోసం ఆ ప్యాథోజన్ స్మగ్లింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ ఉగ్రవాద ఆయుధంగా ఆ బయోలాజికల్ ప్యాథోజన్‌ను వాడేందుకు ప్రయత్నాలు జరిగినట్లు అమెరికా ఆరోపించింది. వ్యాధికారక ఆ ఫంగస్ శాస్త్రీయ నామం పుసేరియం గ్రామినేరియం.
శాస్త్రీయ పరంగా దీన్ని ఆగ్రో టెర్రరిజం వెపన్‌గా వినియోగిస్తారని అమెరికా న్యాయ శాఖ చెప్పింది. వివిధ రకాల పంటలు ఆ ఫంగస్ సోకితే చనిపోతాయి. దీంతో భారీ స్థాయిలో ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. దీని వల్ల బిలియన్లలో నష్టం జరిగే అవకాశాలు ఉన్నట్లు అమెరికా న్యాయశాఖ పేర్కొన్నది. పూసేరియం గ్రామినేరరియం వల్ల పంటలకు నష్టమే కాదు ఆ ఆహారం తిన్న మనుషులకు రకరకాల వ్యాధులు సోకే అవకాశాలు ఉన్నాయి.
వాంతులు, లివర్ డ్యామేజ్ కావొచ్చు. మనుషులతో పాటు జంతువుల్లో ప్రత్యుత్పత్తి సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. బయోలాజికల్ ఫంగస్ వెపన్‌ను స్మగ్లింగ్ చేసిన కేసులో 33 ఏళ్లు యున్కింగ్ జియాన్, 34 ఏళ్ల జుయాంగ్ లియూలను అరెస్టు చేశారు. వారిపై కుట్ర, స్మగ్లింగ్ కేసు నమోదు చేశారు. తప్పుడు ప్రకటనలు చేశారని, వీసా ఫ్రాడ్ కేసు కూడా వాళ్లపై బుక్ చేసినట్లు మిచిగన్ జిల్లా జడ్జి పేర్కొన్నారు.
ఫంగస్ స్మగ్లింగ్‌పై ఎఫ్‌బీఐ కేసు నమోదు చేసింది. డెట్రాయిట్ ఎయిర్‌పోర్టు ద్వారా ఆ స్మగ్లింగ్ చేశారు. మిచిగన్ యూనివర్సిటీ ల్యాబ్‌లో పరీక్షల కోసం ఆ రూట్లో స్మగ్లింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ల్యాబ్‌లో లియూ గర్ల్‌ఫ్రెండ్ జియాన్ గతంలో పనిచేసింది. పుసేరియం గ్రామినేరియం ఫంగస్ వల్ల గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి పంటలకు వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది.
గతంలో జియాన్‌కు చైనీస్ ప్రభుత్వం ఫండింగ్ ఇచ్చింది. చైనాలో ఇదే వ్యాధికారక ప్యాథోజన్‌పై పరీక్షలు చేపట్టిందామె. చైనీస్ కమ్యూనిస్టు పార్టీతో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఆ జంట ప్రవర్తించిన తీరు ప్రజల భద్రతకు ముప్పుగా ఉన్నట్లు ఎఫ్‌బీఐ డెట్రాయిల్ ఫీల్డ్ ఆఫీసు ఇంచార్జ్ చెవోరియా గిబ్సన్ తెలిపారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ కూడా దీనిపై స్పందించారు. అమెరికా సంస్థలపై చైనా తన పరిశోధకుల్ని పంపిస్తున్నదని ఆరోపించారు. అమెరికాలో ఆహార సరఫరా వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం చైనా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎఫ్‌బీఐతో పాటు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఈ కేసులో సంయుక్త విచారణ చేపడుతున్నాయి.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా