సెప్టెంబ‌ర్ 30 నుంచి మ‌హిళ‌ల వ‌ర‌ల్డ్ క‌ప్

సెప్టెంబ‌ర్ 30 నుంచి మ‌హిళ‌ల వ‌ర‌ల్డ్ క‌ప్

భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్న  మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ సెప్టెంబ‌ర్ 30న మొద‌లు కానుంది. ఇరుదేశాల్లో మెగా టోర్నీ జ‌రిపేందుకు ఐసీసీ సన్నాహకాలు చేప‌ట్టిన ఐసీసీ సోమ‌వారం షెడ్యూల్‌ను ప్ర‌క‌టించింది. ఇరుదేశాల్లో ఐదు వేదిక‌ల‌పై 13వ ఎడిష‌న్ వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లు ఉంటాయని తెలిపింది.  ఈసారి టైటిల్ కోసం ఎనిమిది జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. భార‌త్‌, శ్రీ‌లంక‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లు నువ్వానేనా అన్న‌ట్టు త‌ల‌ప‌డ‌నున్నాయి.

సెప్టెంబ‌ర్ 30న జ‌రుగ‌బోయే ఆరంభ పోరులో బంగ్లాదేశ్‌తో భార‌త జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది. తొలి సెమీ ఫైన‌ల్ అక్టోబర్ 29న గువాహ‌టి లేదా కొలంబోలో, రెండో సెమీస్ అక్టోబ‌ర్ 30న బెంగ‌ళూరులో జ‌రుగుతాయి. రెండు రోజుల విరామం అనంత‌రం నవంబ‌ర్ 2 న జ‌రుగ‌బోయే ఫైన‌ల్‌తో విజేత ఎవ‌రో తేలిపోనుంద‌ని ఐసీసీ చెప్పింది. వ‌ర‌ల్డ్ క‌ప్ పోటీల‌కు భార‌త్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్నా సింహ‌భాగం మ్యాచ్‌లు భారత్ లోనే జ‌రుగున్నాయి.
దాదాపు 12 ఏళ్ల త‌ర్వాత మ‌హిళ‌ల వ‌రల్డ్ క‌ప్ టోర్నీకి భార‌త్ ఆతిథ్యం ఇస్తోంది. కాబ‌ట్టి ఐసీసీ భారత్ లోని నాలుగు స్టేడియాల్లో, లంక‌లోని ఒక స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వ‌హణ‌కు ఆమోదం తెలిపింది. మ‌న దేశంలోని చిన్న‌స్వామి స్టేడియం(బెంగ‌ళూరు), ఏసీఏ స్టేడియం(గువాహ‌టి), హోల్క‌ర్ మైదానం(ఇండోర్), ఏసీఏ-వీడీసీఏ స్టేడియం(విశాఖ‌ప‌ట్ట‌ణం)లలో వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లు నిర్వ‌హించ‌నున్నారు.
శ్రీ‌లంక విష‌యానికొస్తే కొలంబోలోని ఆర్.ప్రేమ‌దాస స్టేడియం మెగా టోర్నీ మ్యాచ్‌ల‌కు వేదిక కానుంది. 2022లో విజేత‌గా నిలిచిన‌ ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా అడుగుపెట్ట‌నుంది.