ఉగ్రవాదులతో సంబంధాలు.. ముగ్గురు జేకే ఉద్యోగుల తొలగింపు

ఉగ్రవాదులతో సంబంధాలు.. ముగ్గురు జేకే ఉద్యోగుల తొలగింపు

* పంజాబ్ లో మరో గూఢచారి అరెస్ట్

ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న పలువురు ప్రభుత్వ ఉద్యోగులపై జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వం వేటు వేసింది. పోలీస్‌ కానిస్టేబుల్‌ ఇష్ఫాక్‌ నసీర్‌, స్కూల్‌ టీచర్‌ అజాజ్‌ అహ్మద్‌ , ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్‌ అసిస్టెంట్‌ వసీమ్‌ అహ్మద్‌ఖాన్‌.. ఈ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

 
ఈ ముగ్గురు ఉద్యోగులకు లష్కరే తోయిబా, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు తేలడంతో చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరు ఉగ్రవాదులకు సరకులు అందజేయడం, ఆయుధాల స్మగ్లింగ్‌, భద్రతా దళాలకు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు సాయం చేయడం వంటివి చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ముగ్గురుని అధికారులు జైలుకు తరలించారు.మరోవంక, దేశ సైనిక రహస్యాలను పాకిస్థాన్ నిఘావర్గాలకు చేరవేస్తున్న మరో వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తార్న్‌ తరణ్‌ జిల్లాకు చెందిన గగన్‌దీప్‌ సింగ్‌ అనే వ్యక్తికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమాచారాన్ని పాక్‌ ఐఎస్‌ఐకి చేరవేసినట్లుగా గుర్తించిన తెలిపారు. 

పంజాబ్ కౌంటర్‌ ఇంటిలిజెన్స్ పోలీసులు, తార్న్‌తరన్‌ పోలీసులు సంయుక్తంగా గగన్‌దీప్ సింగ్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్‌ యాదవ్‌ ప్రకటించారు. నిందితుడికి ఖలిస్థాన్ తీవ్రవాది గోపాల్ సింగ్ చావ్లా, పాక్ ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించామని పంజాబ్ డీజీపీ పేర్కొన్నారు. గగన్‌దీప్ సింగ్‌కు ఖలిస్థాన్ తీవ్రవాది గోపాల్ సింగ్ చావ్లాకు ఐదేళ్లుగా పరిచయం ఉందని తేలిందని వివరించారు. 

గగన్‌ దీప్ సింగ్‌ను పాక్ నిఘా వర్గాలకు గోపాల్ సింగ్ పరిచయం చేశాడని పేర్కొన్నారు. గగన్‌దీప్ భారత బలగాల మోహరింపులు, కీలకమైన ప్రదేశాలను పాక్ నిఘా సంస్థలకు అందించినట్లు చెప్పారు. ఇది దేశ భద్రతకు ముప్పు కలిగిస్తోందని డీజీపీ వివరించారు.