భార‌త్‌లో కార్ల త‌యారీకి టెస్లా అనాసక్తి

భార‌త్‌లో కార్ల త‌యారీకి టెస్లా అనాసక్తి
టెస్లా కంపెనీ భార‌త్‌లో త‌న కార్ల‌ను ఉత్ప‌త్తి చేయ‌డానికి ఆస‌క్తిగా లేద‌ని కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి హెచ్‌డీ కుమార‌స్వామి తెలిపారు. కానీ ఆ కంపెనీ భారత్ లో షోరూమ్‌ల‌ను ఏర్పాటు చేసేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇటీవ‌ల అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ త‌మ ఉత్ప‌త్తుల‌పై టారిఫ్‌లు పెంచిన విష‌యం తెలిసిందే. 
 
ఒక‌వేళ టెస్లా కంపెనీ భారత్ లో ఉత్ప‌త్తి ప్రారంభిస్తే అప్పుడు త‌మ వ్యాపారానికి స‌మ‌స్య ఏర్ప‌డుతుంద‌ని ట్రంప్ పేర్కొన్నారు. అయితే భార‌త్‌లో ఎల‌క్ట్రిక్ కార్ల ఉత్ప‌త్తిని ప్రోత్స‌హించేందుకు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను నిర్దేశిస్తూ ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మంత్రి కుమార‌స్వామి మాట్లాడుతూ టెస్లా కంపెనీ భారత్ లో షోరూమ్‌లు స్టార్ట్ చేసేందుకు ఎక్కువ ఆస‌క్తిగా ఉన్న‌ట్లు చెప్పారు. త‌యారీ కోసం ఆ కంపెనీ ఆస‌క్తిగా లేద‌ని స్పష్టం చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు టెస్లా కంపెనీ ఉత్ప‌త్తిపై శ్ర‌ద్ధ చూప‌ట్ట లేద‌ని, స్టేక్ హోల్డ‌ర్ల స‌మావేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు టెస్లా ప్ర‌తినిధి ఒక్క‌సారి మాత్ర‌మే పాల్గొన్నాడ‌ని మంత్రి వెల్ల‌డించారు. రెండ‌వ‌, మూడ‌వ రౌండ్ చ‌ర్చ‌ల్లో ఆ కంపెనీ ప్ర‌తినిధి పాల్గొన‌లేద‌ని తెలిపారు. టెస్లా సీఈవో బిలియ‌నీర్ ఎల‌న్ మ‌స్క్ ఇటీవ‌ల భార‌త ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. ప‌ని భారం వ‌ల్ల ఆయ‌న ఏప్రిల్ ట్రిప్‌ను ర‌ద్దు చేసుకున్నారు. అంతర్జాతీయ సంస్థలైన మెర్సిడెస్‌ బెంజ్‌, స్కోడా-వోక్స్‌వాగన్‌, హుండారు, కియాలు భారత్‌లో విద్యుత్‌ కార్లను తయారు చేసేందుకు ముందుకు వచ్చాయని కేంద్ర మంత్రి తెలిపారు.