శర్మిష్ట విడుదలకై పెరుగుతున్న వత్తిడి

శర్మిష్ట విడుదలకై పెరుగుతున్న వత్తిడి
‘ఆపరేషన్‌ సిందూర్‌’ పై బాలీవుడ్‌ ప్రముఖుల మౌనాన్ని ప్రశ్నిస్తూ సోషల్‌ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేసిన న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలిని కోల్కతా పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని ఖండిస్తూ ఆమెను వెంటనే విడుదల చేయాలని ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌ డిమాండ్‌ చేసింది. ఆమెను వెంటనే విడుదల చేయాలని భారత బార్ కౌన్సిల్ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా కూడా డిమాండ్ చేశారు.  రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ శర్మిష్ట పనోలికి ఆమెకు మద్దతుగా నిలబడుతున్నట్లు తెలిపారు.
 
పశ్చిమ బెంగాల్ బిజెపి సహ-ఇన్‌చార్జ్ అమిత్ మాల్వియా, రాజకీయ లాభం కోసం టిఎంసి చట్టాన్ని “ఎంపికగా అమలు చేస్తోందని” ఆరోపించారు. “కేవలం 22 ఏళ్ల శర్మిష్ట పనోలిని అరెస్టు చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు, ఆమె ఇప్పటికే మే 15న తొలగించి బహిరంగంగా క్షమాపణలు చెప్పింది” అని మాల్వియా ఎక్స్ లో ఒక పోస్ట్‌లో రాశారు.
 
ఢిల్లీ బార్‌ కౌన్సిల్ ఛైర్మన్ సూర్య ప్రకాష్ ఖత్రి మాట్లాడుతూ లా చదువుతున్న విద్యార్థినిని పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.  శర్మిష్ఠ చేసిన పోస్టువల్ల కొందరికి బాధ కలిగినప్పటికీ ఆమె వెంటనే దానిని డిలీట్‌ చేసి, క్షమాపణలు చెప్పారని, అయినా ఇలాంటి చర్యలు తీసుకోవడం సరైంది కాదని సూర్య ప్రకాష్ స్పష్టం చేశారు. 
 
పశ్చిమ బెంగాల్‌లో మితిమీరిన రాజకీయ ప్రేరేపిత చర్యలకు ఇది ఉదాహరణ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  బాధ్యతాయుత స్థానంలో ఉన్న పోలీసులు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ఖత్రి ప్రశ్నించారు.  కాగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై బాలీవుడ్‌ ప్రముఖుల మౌనాన్ని ప్రశ్నిస్తూ మే 14న శర్మిష్ఠ సోషల్‌ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో తన పోస్టులు, రీల్స్‌ తొలగించి ఆమె క్షమాపణలు కోరారు. అయినా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

శర్మిష్ఠ అరెస్టును ఖండిస్తూ ఏపీ ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, బెంగాల్‌ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ‘ఎక్స్‌’లో పోస్టులు పెట్టారు. కోల్‌కతా పోలీసుల చర్య భారత్‌లోని వాక్‌స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందని డచ్‌ ఎంపీ గీర్ట్‌ వైల్డర్స్‌ సైతం ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. శర్మిష్ఠకు సాయం చేయాలని ప్రధాని మోదీని ఆయన కోరారు. తాజాగా ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌ కూడా శర్మిష్ఠ విడుదలకు డిమాండ్‌ చేసింది.