
యుద్ధంలో చనిపోయిన 6వేల మంది సైనికుల మృతదేహాల పరస్పర బదిలీకి రష్యా, ఉక్రెయిన్ అంగీకరించాయి. ఇకపై కూడా పరస్పరం యుద్ధ ఖైదీలను బదిలీ చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. ఓ వైపు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తీవ్రరూపు దాలుస్తుండగా, మరోవైపు ఈ దేశాల ప్రతినిధుల మధ్య సోమవారం రెండో విడత శాంతి చర్చలు జరిగాయి.
తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సిరాగన్ ప్యాలస్ ఇందుకు వేదికగా నిలిచింది. ఈ చర్చలకు తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ మధ్యవర్తిత్వం వహించారు. కేవలం గంటన్నర వ్యవధిలోనే శాంతి చర్చలు ముగిశాయి. ఈ చర్చలు ఫలప్రదంగా ఉండేలా నిర్ణయాలు వెలువడాలంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశం కావాలని ఇరుదేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
కాల్పుల విరమణకు సంబంధించిన షరతులపైనా ఈసందర్భంగా ప్రస్తావన వచ్చింది. రెండో విడత శాంతి చర్చల వివరాలను ఉక్రెయిన్ రక్షణ మంత్రి రుస్తెం ఉమెరోవ్ మీడియాకు వెల్లడించారు. బేషరతుగా కాల్పుల విరమణను అమల్లోకి తేవాలనే తమ ప్రతిపాదనను రష్యా ఇప్పటికీ తిరస్కరిస్తోందని ఆయన తెలిపారు.
ఈ అంశాలపై మరింత లోతుగా చర్చించి, ఆయా వ్యవహారాల్లో పురోగతి సాధించేందుకు జూన్ నెలాఖరులోగా మరోసారి సమావేశం కావాలని రష్యాకు ప్రతిపాదించామని రుస్తెం ఉమెరోవ్ చెప్పారు. ఇస్తాంబుల్‌లో జరుగుతున్న శాంతి చర్చల్లో ఏమీ సాధించలేకపోతే, రష్యాపై వీలైనంత త్వరగా కొత్త ఆంక్షలను విధించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ డిమాండ్ చేశారు.
‘‘ఈ యుద్ధంలో ఏం కోల్పోతోందో రష్యా గ్రహించాలి. కనీసం ఇప్పటికైనా దౌత్యపరమైన మార్గాల్లో చర్చలకు రావాలి. కచ్చితంగా జరగబోయేది కూడా అదే’’ అని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. ఇంతకుముందు మే 16న ఇస్తాంబుల్‌లోనే రష్యా, ఉక్రెయిన్ శాంతిచర్చలు జరిపాయి. ఇరుదేశాలు పరస్పరం 1000 మంది చొప్పున యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని అప్పట్లో నిర్ణయించారు. ఈసారి చర్చల్లోనూ అదే తరహా నిర్ణయంతో సరిపెట్టడం గమనార్హం.
More Stories
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్లో చీలిక!
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్