అమెరికా దిగుమతులపై రాయితీలు క్రమంగా తొలగింపు

అమెరికా దిగుమతులపై రాయితీలు క్రమంగా తొలగింపు
అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులకు ఇస్తున్న రాయితీలను క్రమంగా తొలగించాలని, అగ్రరాజ్యం నుంచి దిగుమతి అయ్యే లోహాలపై అధిక సుంకాలు విధించడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.  భారత స్టీల్, అల్యూమినియంపై విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా అమెరికాకు చెందిన వస్తువులపై ప్రతీకార సుంకాలు విధిస్తామంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా నోటీసులు ఇప్పించినా అమెరికా స్పందించకపోవడంతో భారత్‌ ఈ నిర్ణయం తీసుకుంది.
 
కాగా అమెరికాకు చెందిన కొన్ని రకాల వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించనున్నామన్న విషయాన్ని భారత్‌ ఇటీవల ప్రపంచ వ్యాణిజ్యసంస్థకు వెల్లడించింది. భారత స్టీల్‌, అల్యూమినియంపై విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా అమెరికాకు నోటీసులు ఇప్పించింది. అయితే ఆ నోటీసులను అగ్రరాజ్యం తిరస్కరించింది. 
 
భారత్‌ నిర్ణయం బహుపాక్షిక వాణిజ్య నియమాలకు అనుగుణంగా లేదని పేర్కొంది. ఉక్కు, అల్యూమినియంపై తమ సుంకాలు భారత్‌ పేర్కొన్నట్లుగా ‘భద్రతా చర్యలు’ కాదని, జాతీయ భద్రతా పరిగణనలపై ఆధారపడి ఉన్నాయని తెలిపింది. ఈ విషయంపై భారత్‌తో ఎలాంటి చర్చలు నిర్వహించబోమని ట్రంప్‌ యంత్రాంగంలోని అధికారులు వెల్లడించారు. 
 
ఈ నేపథ్యంలో అమెరికా దిగుమతులకు ఇస్తున్న రాయితీలను దామాషా ప్రకారం తొలగించాలని భారత్‌ భావిస్తోంది. అమెరికా నుంచి వచ్చే లోహాలపై అధిక సుంకాలు విధించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. భారత్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉక్కు, అల్యూమినియంలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు తొలుత ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ఈ సుంకాలను జూన్ 4 నుంచి 50 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. 
 
దీనివల్ల 7.6 బిలియన్‌ డాలర్ల విలువైన భారత్‌ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడనుంది. దాంతో అగ్రరాజ్యం రక్షణాత్మక వైఖరిని అవలంభిస్తోందని తప్పుపడుతూ భారత్‌ ప్రపంచ వ్యాణిజ్యసంస్థను ఆశ్రయించింది. సరికొత్త వాణిజ్య ఒప్పందానికి భారత్‌, అమెరికా అత్యంత సమీపంలోకి వచ్చినట్లు వార్తలొస్తున్న వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.
 
 అమెరికాకు వాణిజ్యలోటును తగ్గించేందుకు భారత్‌ చాలా రాయితీలను ఈ డీల్‌ ద్వారా ఆఫర్‌ చేసినట్లు ప్రచారం జరిగింది. కాగా ప్రస్తుతం అగ్రరాజ్యం అనుసరిస్తున్న చర్యలతో ఆ రాయితీలకు కోతలు విధించే అవకాశం ఉంది.