అంతర్జాతీయ వైమానిక రవాణా పరిశ్రమలో భారత్ కీలకపాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విమానయాన రంగం, టాలెంట్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నొవేటర్స్, ఓపెన్ అండ్ సపోర్టివ్ పాలసీకి ఇండియా మార్కెట్లో అవకాశాలు ఉన్నాయని మోదీ చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత విమానయాన రంగంలో ప్రముఖ గ్లోబల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న అంతర్జాతీయ వైమానిక రవాణా సంఘం (ఐఎటిఎ) 81వ వార్షిక సాధారణ సమావేశంలో ప్రధానమంత్రి సోమవారం పాల్గొంటూ విమానయాన రంగంతోపాటు అంతర్జాతీయ సహకారం, వాతావరణ కట్టుబాట్లు, సమానమైన వృద్ధి ఎజెండాను ముందుకు తీసుకువెళ్లే వేదికగా ఈ సదస్సు సాగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
“ఈ సదస్సులో చర్చించిన అంశాలు ప్రపంచ వైమానిక రంగంలో కొత్త దిశకు మార్గం సుగమం కావాలి. ఈ రంగంలో లెక్కలేనన్ని అవకాశాలను మనం అందిపుచ్చుకుని, వాటిని మరింత సమర్ధవంతంగా వినియోగించుకోగలమనే నమ్మకం నాకు ఉంది. ఇవాళ వందలాది కిలోమీటర్ల దూరాలు, ఖండాతర ప్రయాణాలు కొన్ని గంటల్లోనే చేయగలుగుతున్నాం. అయితే 21వ శతాబ్దపు ప్రపంచ కలలు, మన అనంతమైన ఊహలు ఆగిపోకూడదు. నూతన ఆవిష్కరణలు, సాంకేతికత అప్గ్రేడేషన్ గతం కంటే ఎంతో వేగంగా ముందుకు వెళ్తున్నాయి” అని మోదీ పేర్కొన్నారు.
నాలుగు దశాబ్దాల తర్వాత ఈ ఈవెంట్ భారత్ లో జరుగుతోందని, ఈసారి చాలా మార్పులు వచ్చాయని ప్రధాని చెప్పారు. ఇవాళ ఇండియా మరింత ధీమాతో ఉందని, గ్లోబల్ ఏవియేషన్ ఎకోసిస్టమ్లో భారత్ అతిపెద్ద మార్కెట్ మాత్రమే కాకుండా, విధాన నాయకత్వం, నవీకరణ, సమ్మిళత వృద్ధికి ప్రతీకగా ఉన్నామని చెప్పారు.
ఈరోజు గ్లోబల్ స్పేస్ ఏవియేషన్ కన్వర్జెన్స్లో లీడర్గా భారత్ నిలిచిందని, దేశీయ పౌర విమానయాన రంగంలో గత దశాబ్ద కాలంలో ఇండియా చారిత్రక ఎదుగుదల అందరికీ తెలిసిందేనని తెలిపారు. కాగా, ఐఏటీఏ 81వ వార్షిక సాధారణ సమావేశంతోపాటు ప్రపంచ వైమానికి రవాణా శిఖరాగ సదస్సు (డబ్ల్యూఏటీఎస్) కూడా జూన్ 1న మొదలై జూన్ 3 వరకూ జరుగనుంది. ఈ సమావేశంలో ప్రపంచ విమానయాన పరిశ్రమ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు, అంతర్జాతీయ ప్రసార మాధ్యమాల ప్రతినిధులు సహా 1,600 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు.
More Stories
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవంకు ముఖ్యఅతిధిగా మాజీ రాష్ట్రపతి
ఇద్దరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మృతి
టీ20ల్లో చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ