మీరేమైనా చరిత్రకారులా కమల్‌ హాసన్?

మీరేమైనా చరిత్రకారులా కమల్‌ హాసన్?
ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్‌పై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకు వాక్ స్వాతంత్య్రం హక్కును దుర్వినియోగం చేయొద్దని ఆయనను హెచ్చరించింది. తీవ్ర వివాదానికి కేంద్ర బిందువుగా మారిన “కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది” అనే వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలని కమల్‌కు హైకోర్టు మంగళవారం సూచించింది.

“మీ వ్యాఖ్యలతో కర్ణాటక ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. మీరేమైనా చరిత్రకారులా? లేక భాషావేత్తనా? ఏ ఆధారాలతో ఆ వ్యాఖ్యలు చేశారు? కన్నడ ప్రజలు మిమ్మల్ని ఏమి అడిగారు? కేవలం క్షమాపణలే కదా. ఈ వ్యవహారంలో ఒక్క క్షమాపణ చెబితే సమస్య మొత్తం పరిష్కారం అవుతుంది” అని న్యాయమూర్తి నాగ ప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.

కన్నడ భాషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు థగ్‌లైఫ్‌ సినిమాను ప్రదర్శించకూడదన్న కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు నటుడు కమల్‌ హాసన్‌ తీరుపై అసహనం వ్యక్తం చేసింది.b“మీరు కమల్‌ హాసన్‌ కావొచ్చు.. ఎంత పెద్ద నటుడైనా కావొచ్చు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు మీకు లేదు. ఒక ప్రజాప్రతినిధిగా అలాంటి ప్రకటన చేయకూడదు” అని స్పష్టం చేసింది.

“మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోలేరు. కానీ అందుకు క్షమాపణలు చెప్పొచ్చు. పగలగొట్టి వండేసిన గుడ్లను మీరు పగలగొట్టని పూర్వ స్థితికి తీసుకెళ్లలేరు” అని కమల్‌కు హైకోర్టు హితవు పలికింది. గతంలో ఎప్పుడో ఏదో జరిగిపోయి ఉంటే, దాన్ని రివర్స్ చేయలేమనే అర్థాన్ని ఇచ్చే ఒక ఆంగ్ల నానుడిని ప్రయోగిస్తూ న్యాయస్థానం ఈ కామెంట్స్ చేసింది. 

“మీరు సాధారణ వ్యక్తేం కాదు. మీకు వాక్ స్వాతంత్య్రం ఉంది. కానీ దానితో ఇతరులను బాధపెట్టకూడదు. ఇతరులను బాధపెట్టడం కోసం మీకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఇవ్వలేదు. ఇప్పటికైతే ఈ విషయాన్ని మీకే వదిలేస్తున్నాం. మీరు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమాపణలు చెప్పండి” అని కమల్‌కు హైకోర్టు నిర్దేశించింది. ‘క్షమాపణలు చెప్పకుండా కోర్టుకు వచ్చారా..?’ అంటూ తీవ్రంగా మండిపడింది.

గురువారం విడుదలకానున్న కమల్ హాసన్ సినిమా ‘థగ్ లైఫ్‌’ను ఈ సందర్భంగా న్యాయస్థానం పరోక్షంగా ప్రస్తావించింది. “కన్నడ భాషను ఉద్దేశించి మీరు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోండి. కర్ణాటకలోనూ కోట్లు సంపాదించుకోవచ్చు. మీకు కన్నడ ప్రజలు అక్కర్లేదని భావిస్తే ఆదాయాన్ని వదులుకోండి” అని కమల్‌ను హైకోర్టు కోరింది. 

పబ్లిక్ సెంటిమెంటును ఎవరు దెబ్బతీసినా తాము ఊరుకునేది లేదని హెచ్చరించింది. “కన్నడ ప్రజలను బాధపెట్టేలా మాట్లాడింది మీరు, ఇప్పుడేమో క్షమాపణ చెప్పనని వాదిస్తున్నారు. కర్ణాటక ప్రజల సెంటిమెంట్‌ను మీరు తక్కువ అంచనా వేశారు… నా మాటల వల్ల ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమించండి అని మీరు ప్రకటించండి” అని కమల్‌‌కు న్యాయమూర్తి నిర్దేశించారు.

కన్నడ ప్రజలకు కమల్ హాసన్ క్షమాపణ చెప్పకుంటే థగ్ లైఫ్ సినిమాను తమ రాష్ట్రంలో విడుదల చేయనిచ్చేది లేదని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సోమవారం హెచ్చరించింది. అయితే తాను క్షమాపణ చెప్పేది లేదని గత శుక్రవారం (మే 30న) కమల్ స్పష్టం చేశారు. తాను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదన్నారు. ఇది ప్రజాస్వామిక దేశమని, చట్టంపై తనకు నమ్మకం ఉందని పేర్కొన్నారు.