క్రూరత్వం  నేరాలకు సంబంధించి హసీనాపై మరో అభియోగం

క్రూరత్వం  నేరాలకు సంబంధించి హసీనాపై మరో అభియోగం
బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై అక్కడి ప్రాసిక్యూటర్లు మరో నేరాభియోగం మోపారు. సామాన్య పౌరులపై క్రూరత్వం ప్రదర్శించినట్లు ఆరోపణలు చేశారు. 2024లో విద్యార్థుల ఉద్యమాన్ని ఆమె క్రూరంగా అణచివేయాలని చూసినట్లు అభియోగంలో పేర్కొన్నారు. భద్రతా దళాలు, తన పార్టీ సభ్యులు ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు చర్యలు తీసుకోవాలని హసీనా నేరుగా ఆదేశించినట్లు గుర్తించామని చెప్పారు.

ఇందుకు సంబంధించిన ఎన్‌క్రిప్టెడ్‌ కమ్యూనికేషన్‌లు, వీడియో ఆధారాలు ఉన్నాయని చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ తాజుల్‌ ఇస్లాం తెలిపారు. దీనికి 81 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. దేశంలో సంక్షోభ సమయంలో భద్రతాదళాలు తీసుకున్న చర్యలకు నాటి దేశాధినేత హసీనాదే బాధ్యత అని తాజుల్‌ చెప్పారు.  షేక్‌ హసీనాతో పాటు మరో ఇద్దరు అధికారులపై ఈ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

రాష్ట్ర భద్రతా దళాలు, ఆమె రాజకీయ పార్టీ, అనుబంధ సమూహాలు భారీ ప్రాణ నష్టం కలిగేలా ఆపరేషన్లు నిర్వహించాలని హసీనా నేరుగా ఆదేశించారని దర్యాప్తు నివేదికలో తేలింది.  ప్రభుత్వ అధినేతగా హసీనా, ఉద్రిక్తతల సమయంలో భద్రతా దళాల కార్యకలాపాలకు బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు. ఉద్రిక్తతల్లో 1500 మంది మరణించగా, 25,000 మంది గాయపడినట్లు ఇస్లాం తెలిపారు.

గత ఏడాది బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగడంతో ఆ దేశ ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా చేశారు. దాదాపు 15 ఏళ్లపాటు ఆమె దేశాన్ని పరిపాలించారు. గత ఆగస్టులో ఆమె ఢాకాను వీడి న్యూఢిల్లీకి చేరుకున్నారు. నాటి నుంచి ఆమె అక్కడే ఆశ్రయం పొందారు. బంగ్లాదేశ్‌లో యూనస్‌ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం వరుసగా హసీనాపై కేసులను బనాయిస్తోంది. ఆమె కుటుంబ సభ్యులపై పలు ఆరోపణలు వచ్చాయి.

మరోవైపు ఆమెపై ఇప్పటికే 100కు పైగా కేసులున్నాయి. ఇప్పటికే ఇంటర్నేషనల్‌ క్రైమ్‌ ట్రిబ్యునల్‌ ఆమెపై అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. మరో సమాంతర పరిణామంలో, బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఆదివారం ఎన్నికల సంఘాన్ని జమాత్-ఇ-ఇస్లామి రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించాలని ఆదేశించింది, దీని ద్వారా దశాబ్ద కాలం పాటు నిషేధం విధించిన తర్వాత ఆ పార్టీ భవిష్యత్ ఎన్నికలలో పాల్గొనడానికి వీలు కల్పించింది. 

ప్రధాన న్యాయమూర్తి సయ్యద్ రెఫాత్ అహ్మద్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు అప్పీలేట్ డివిజన్ ఈ ఆదేశాన్ని జారీ చేసింది. అయితే, రాబోయే ఎన్నికలలో ఆ పార్టీ తన సాంప్రదాయ ఎన్నికల చిహ్నమైన “స్కేల్”ను ఉపయోగించవచ్చో లేదో నిర్ణయించడంను ఈసీ విచక్షణకే వదిలివేసింది. 2013 హైకోర్టు తీర్పు ప్రకారం, జమాత్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హమైనదిగా పరిగణించిన తర్వాత, డిసెంబర్ 2018లో జమాత్ రిజిస్ట్రేషన్‌ను ఈసీ,  రద్దు చేసింది. పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ 1971లో స్వాతంత్ర్యం కోసం జరిగిన యుద్ధాన్ని జమాత్ వ్యతిరేకించడం అనర్హతకు ఒక కారణమని కోర్టు పేర్కొంది.