కేసీఆర్ కుటుంబ డ్రామాల్లో బిజెపి పాత్రధారి, సూత్రధారి కాదు

కేసీఆర్ కుటుంబ డ్రామాల్లో బిజెపి పాత్రధారి, సూత్రధారి కాదు
రాష్ట్రంలో రాజకీయ, కుటుంబ డ్రామాలు నడుస్తున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. కుటుంబ డ్రామాల్లో బీజేపీ పాత్రధారి, సూత్రధారి కాదని ఆయన స్పష్టం చేశారు. ఆస్తులు, అధికారం, అవినీతి డబ్బుల కోసం బీఆర్‌ఎ్‌సలో గొడవలు జరుగుతున్నాయని, వాటితో బీజేపీకి సంబంధం లేదని తేల్చి చెప్పారు. 
 
ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనా విజయాలకు సంబంధించి ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వర్క్‌షాప్‌ లో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ హయాంలో అవినీతి కేంద్రీకృతం కాగా, కాంగ్రెస్‌ హయాంలో వికేంద్రీకృతం అయిందని విమర్శించారు. వందలాది మంది బలిదానంతో తెలంగాణను సాధించుకున్నది కేసీఆర్‌ కుటుంబం, కాంగ్రెస్‌ నాయకులు దోచుకోవడానికా? అని మండిపడ్డారు. 
 
బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయని కేంద్ర మంత్రి ఆరోపించారు. ఈ రెండు ప్రభుత్వాల వైఖరి వల్ల రూ.10 లక్షల కోట్ల అప్పు అయిందని, ఒక్క సింగరేణికే సర్కారు రూ.42 వేల కోట్లు బాకీ ఉందని పేర్కొన్నారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం రేవంత్‌ పాకిస్థాన్‌తో యుద్ధం గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. 
 
ఎన్నికల్లో హామీ ఇచ్చిన హామీల అమలు ఏమైందో రేవంత్‌ మాట్లాడరని మండిపడ్డారు. తెలంగాణలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. 11 ఏళ్ల మోదీ పాలనలో చేపట్టిన కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ అవినీతి, కాంగ్రెస్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. 
 
11 ఏళ్లలో మోదీ చేసిన పనులను దేశ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ లు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశాయని పేర్కొంటూ సింగరేణికి 42 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని, బ్యాంకులు, సంస్థలకు రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందని పేర్కొన్నారు. బీఆర్​ఎస్​ అప్పు చేస్తే తామేం తక్కువ తిన్నామా? అని కాంగ్రెస్​ కూడా అప్పు చేసిందని ధ్వజమెత్తారు.
 
 రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని పేర్కొంటూ మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప తెలంగాణలో డబుల్​ ఇంజన్​ సర్కార్​ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు.  రాష్ర్టాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని పేర్కొంటూ తెలంగాణ అభివృద్ధిపై చిత్తశుద్ధితో వ్యవహరించే పార్టీ బిజెపి మాత్రమే అని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఈ రాష్ర్టాన్ని రక్షించే పరిస్థితి ఈ కుటుంబ పార్టీకి, అవినీతి పార్టీకి లేదని తేల్చి చెప్పారు.