
మత ఛాందసవాదుల ప్రేరణతో ఉగ్ర కుట్ర కేసు నిందితుడు సిరాజ్ ఉర్ రెహ్మాన్, ‘ఆల్-హింద్ ఇత్తేహదుల్ ముస్లమీన్’ (అహిం) పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ముస్లిం మహిళలు మోసపోకుండా రక్షించే లక్ష్యంతో దీనిని ప్రారంభించాడు. ఈ పేరుతో దేశంలోని వివిధ నగరాలకు ఉగ్ర కార్యకలాపాలు విస్తరించాలని వ్యూహం రచించాడు. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారుల విచారణలో ఈ కొత్త కోణం వెలుగుచూసింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, సిరాజ్ స్థానికంగా చేపడుతున్న కార్యకలాపాలను విదేశీ తీవ్రవాద సంస్థలు గుర్తించాయి. పాకిస్థాన్‌లోని ఐఎస్‌ఐ ద్వారా త్వరలో శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. దీనికి ముందుగా బాంబులు తయారు చేసి నాలుగు చోట్ల పరీక్షించాలని అందిన సూచన మేరకు ప్రయోగించే దశలో అతను పోలీసులకు చిక్కిన విషయం విదితమే.
జిహాదీ చర్యల్లో భాగంగా అవసరమైతే ప్రాణత్యాగానికీ సిద్ధపడిన ఈ యువకుడు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుల ద్వారా ఉగ్రవాద భావజాలం ఉన్న పలువురిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ఒమన్, సౌదీ అరేబియా, పాకిస్థాన్ దేశాల్లో నివాసం ఉంటున్న భారతీయ మతోన్మాదులు అతనిని అన్నివిధాలా ప్రోత్సహించారు. నిధులిచ్చేందుకు కూడా ముందుకొచ్చారు.
వీరిలో ఇప్పటి వరకు అబూ మసాబ్, ఇమ్రాన్ పేర్లు వెలుగు చూసినా, ఇలాంటి వారు మరికొందరు ఉన్నారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. బిహార్‌కు చెందిన అబూ మసాబ్ సౌదీలో ఉంటున్నాడని సిరాజ్ తొలుత చెప్పినా, విచారణలో ప్రస్తుతం ఆయన పాకిస్థాన్‌లో ఉన్నట్లు తెలుసుకున్నారు. త్వరలో ఐఎస్‌ఐ శిక్షణ ఇప్పిస్తానన్న అతని ప్రతిపాదనకు సిరాజ్ అంగీకరించినట్లు తెలిసింది.
ఉగ్ర కార్యకలాపాల విస్తరణకు పూనుకున్న సిరాజ్ ఇప్పటి వరకు ప్రతి అడుగులోనూ తీసుకున్న ముందుజాగ్రత్తలు తెలుసుకుని దర్యాప్తు అధికారులు విస్తుపోయినట్లు సమాచారం. ఒమన్‌లో ఉంటున్న హైదరాబాద్ వాసి ఇమ్రాన్ అక్రమ్, పేలుడు పదార్థాల తయారీకి డబ్బులు పంపిస్తానంటే తన ఖాతా నంబరు ఇవ్వకుండా ఇతరుల ఖాతా నంబరు తెలియజేశాడు. ఆ సొమ్ముతోనే ఆన్‌లైన్‌లో పేలుడు పదార్థాలకు ఆర్డరు పెట్టాడు.
పోలీసుల విచారణలో హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్ ఖాతాకు ఆ నిధులు పంపించినట్లు తొలుత చెప్పినా, తనకు తెలిసిన విజయనగరం వాసి ఖాతాకు జమ చేయించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. విజయనగరంలోని ఆబాద్ వీధిలో సిరాజ్ కుటుంబం నివాసం ఉంటున్నా, ఆన్‌లైన్ పేలుడు పదార్థాల ఆర్డర్‌కు సొంతింటి చిరునామా కాకుండా సమీపంలోని ఉర్దూ పాఠశాల చిరునామా ఇచ్చాడు. తనపై ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.
బాంబు పేల్చివేత ప్రయోగం ఫలించిన తర్వాత అవసరమైన నిధులు పంపిస్తానని ఇమ్రాన్ చెప్పినట్లు విచారణలో సిరాజ్ అంగీకరించాడు. అతనితో సంబంధాలు కలిగిన హైదరాబాద్, ముంబయి, దిల్లీ, వరంగల్ సహా పలు నగరాల్లోని వ్యక్తుల కోసం దర్యాప్తు అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ కేసును తమకు అప్పగించాలని తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు రాష్ట్ర పోలీసుశాఖకు లేఖ రాశారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము