ఫోన్ ట్యాపింగ్‌కు కేసులో 5న విచారణకు ఎస్ఐబి మాజీ చీఫ్

ఫోన్ ట్యాపింగ్‌కు కేసులో 5న విచారణకు ఎస్ఐబి మాజీ చీఫ్

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్‌కు కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. జూన్ 5వ తేదీన ఈ కేసు వ్యవహారంలో విచారణకు హాజరవుతానని దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిగా సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు ప్రభాకర్ రావు అండర్ టేకింగ్ లెటర్ రాసిచ్చినట్లు సమాచారం. వన్ టైం ఎంట్రీ పాస్ పోర్ట్ అందిన వెంటనే భారత్ కు ప్రభాకర్ రావు బయలుదేరినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు అమెరికా నుండి భారత్‌కు తిరిగి వస్తున్నారు. పాస్ పోర్ట్ అందిన మూడు రోజుల్లో భారత్ కు రావాలని ఇప్పటికే ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించింది. 
 
గత 14 నెలలుగా ప్రభాకర్ రావు అమెరికాలోనే తలదాచుకుంటున్న విషయం విదితమే. మరోవైపు ఈ కేసులో ప్రభాకర్ రావు కీలక నిందితుడు కావడంతో అతడిని విచారిస్తే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశముందని దర్యాప్తు బృందం భావిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు, స్వపక్షంలోని అసంతృప్తి నేతల ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. 
 
దీనిపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సెట్) విచారణకు ఆదేశించింది. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. ఇక ఈ కేసుతో ప్రమేయమున్న వారిందరిని ఇప్పటికే సిట్ అధికారులు అరెస్ట్ చేసి సమగ్ర విచారణ చేపట్టారు. అందులో భాగంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ప్రభాకర్ రావును సెట్ అధికారులు గుర్తించారు. 
 
అతడిని స్వదేశానికీ తీసుకు వచ్చే ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. అంతేకాదు ముందస్తుగా అరెస్ట్ చేయకుండా ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును ఆయన కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టులు చేసిన సంగతి తెలిసిందే. విచారణలు జరుగుతున్నప్పటికీ, ప్రభాకర్ రావు పాత్ర అత్యంత కీలకమైనదని దర్యాప్తు బృందం అనుమానం వ్యక్తం చేసింది. ప్రభాకర్​రావును విచారిస్తే ఇంకా ఎవరెవరి పేర్లు వెలుగులోకిస్తాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.