ముస్లిం ఓట్ల కోసమే ఆపరేషన్ సిందూర్​పై మమతా విమర్శలు

ముస్లిం ఓట్ల కోసమే ఆపరేషన్ సిందూర్​పై మమతా విమర్శలు
బుజ్జగింపు రాజకీయాల కోసమే మమతా బెనర్జీ వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తుందన్నారని, ఆపరేషన్​ సిందూర్​ను విమర్శించేది కూడా బంగాల్​లోని ముస్లీం ఓట్​ బ్యాంక్​ కోసమే అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. కోల్​కతాలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అమిత్ షా ​ ముఖ్యమంత్రిగా  మమతా బెనర్జీ పదవీకాలం 2026తో ముగుస్తుందని  జోస్యం చెప్పారు.

బంగాల్​లో వచ్చే ఏడాది బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తులు పహల్గాం ఉగ్రదాడిలో మరణించినా నిశబ్దంగానే ఉన్నారని మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్​ను విమర్శించి, మన దేశ తల్లుల, సోదరీమణులను అపహస్యం చేస్తుందని ఆరోపించారు. అందుకే 2026లో వచ్చే ఎన్నికల్లో ఆమెకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.

“అనేక ఏళ్లుగా కమ్యూనిస్టులు బంగాల్​ను పాలించారు. ఆ తర్వాత వచ్చిన మమత, మా, మాతి, మనుష్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చారు. కానీ ఆ తర్వాత రాష్ట్రాన్ని అక్రమ చొరబాట్లకు, నేరాలకు, దాడులకు అడ్డాగా చేశారు. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో వందలాది మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు” అంటూ అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
బంగాల్​ను అక్రమ చొరబాట్లకు, మహిళలు, హిందువులపై దాడులకు అడ్డాగా మార్చిందని అమిత్​ షా దుయ్యబట్టారు. బీఎస్​ఎఫ్ కోసం అవసరమైన భూమిని టీఎంసీ ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు. బీఎస్​ఎఫ్​కు అవసరమైన భూమిని కేటాయిస్తే అక్రమ చొరబాట్లను అడ్డుకుంటామని చెప్పారు. 

అక్రమ చొరబాట్ల ద్వారానే ఆ పార్టీ అధికారంలో ఉంటుందని, అందుకనే భూమిని కేటాయించడం లేదని ఆరోపించారు. ఇటీవల జరిగిన ముర్షీదాబాద్ అల్లర్లు రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతోనే జరిగాయని విమర్శించారు. కేంద్ర హోం శాఖ అల్లర్లను అదుపులోకి తీసుకువచ్చేందుకు బీఎస్​ఎఫ్ బలగాలను మోహరించిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.