ఆపరేషన్ సిందూర్ వీడియోపై లా విద్యార్థిని శర్మిష్ట అరెస్ట్

ఆపరేషన్ సిందూర్ వీడియోపై లా విద్యార్థిని శర్మిష్ట అరెస్ట్

ఆపరేషన్ సిందూర్ పై బాలీవుడ్ నటుల మౌనాన్ని విమర్శిస్తూ మతపరమైన వ్యాఖ్యలు ఉన్న వీడియోను పోస్ట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పూణే లా యూనివర్సిటీ విద్యార్థిని శర్మిష్ట పనోలి (22)ని కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. లక్షలాది మంది ఫాలోవర్లతో ఆమె ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్. ప్రస్తుత వ్యవహారాలపై ఆమె బహిరంగ అభిప్రాయాలకు పేరుపొందింది.

మే 14, 2025న పహల్గామ్ ఉగ్రవాద దాడిపై, దాడి చేసిన వారిని సమర్థిస్తూ ఒక పాకిస్తానీ అనుచరుడి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆమె పోస్ట్ చేసిన వివాదాస్పద వీడియో తర్వాత జాతీయ స్థాయిలో వెలుగులోకి వచ్చింది.  భారతదేశ సైనిక వైఖరిని ప్రశ్నించిన పాకిస్తాన్ వ్యక్తికి ప్రతిస్పందనగా పనోలి ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఉగ్రవాద దాడి తర్వాత సైనిక చర్య అయిన ఆపరేషన్ సిందూర్ పై బాలీవుడ్ ప్రముఖులు మౌనంగా ఉండటంపై ఆమె తన వీడియోలో విమర్శించింది.

అయితే, ఆమె ఇస్లాం, ప్రవక్త ముహమ్మద్ గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించినప్పుడు ఈ సమస్య తీవ్రమైంది. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీ వ్యతిరేకతకు దారితీశాయి, #ArrestSharmistha వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ఎక్స్ లో ట్రెండ్ అయ్యాయి. ఆమెకు అత్యాచారం, హత్య బెదిరింపులు వచ్చాయి.  దానితో శర్మిష్ట ఆ వీడియోను వెంటనే తొలగించింది. తన ఎక్స్ ఖాతాలో ఓ క్షమాపణ పోస్టు పెట్టింది. 

“నాకు ఎవర్నీ బాధ పెట్టాలన్న ఉద్దేశ్యం లేదు.  ఆ వ్యాఖ్యలు కేవలం నా వ్యక్తిగతం మాత్రమే. నా వ్యాఖ్యలు ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి” అని ఆమె పేర్కొంది. ఇంతలో  ఆపరేషన్ సిందూర్‌పై ఆమె చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై  కోల్‌కతా లోని ఓ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పనోలికి మద్దతు తెలిపారు. ఆమె ఇలా వ్రాసారు: “శర్మిష్ఠ తన భావ వ్యక్తీకరణకు కొన్ని అసహ్యకరమైన పదాలను ఉపయోగించారని నేను అంగీకరిస్తున్నాను. కానీ ఈ రోజుల్లో చాలా మంది యువకులు అలాంటి పదాలను ఉపయోగిస్తున్నారు. ఆమె తన ప్రకటనలకు క్షమాపణలు చెప్పింది. అది సరిపోతుంది. ఆమెను మరింత బెదిరించడం, వేధించడం అవసరం లేదు. ఆమెను వెంటనే విడుదల చేయాలి.”

శుక్రవారం కోల్‌కతా పోలీసులు షర్మిష్టను గురుగ్రాములో అరెస్ట్ చేశారు. శనివారం ఆమెను అలీపోర్ కోర్టులో హాజరుపరిచారు. శర్మిష్ట అరెస్ట్‌పై పోలీసులు మాట్లాడుతూ ‘ శర్మిష్టకు, ఆమె కుటుంబానికి చాలా సార్లు నోటీసులు పంపాము. ఎవరూ పట్టించుకోలేదు. తప్పించుకుని తిరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. శుక్రవారం గురుగ్రాములో ఆమెను అరెస్ట్ చేశాము’ అని తెలిపారు.