పాకిస్థాన్‌పై ఘర్షణల్లో ఫైటర్ జెట్లను కోల్పోయాం

పాకిస్థాన్‌పై ఘర్షణల్లో ఫైటర్ జెట్లను కోల్పోయాం
ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్, పాక్ మధ్య జరిగిన సైనిక ఘర్షణల్లో యుద్ధ విమానాలకు నష్టం జరిగినట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్  అంగీకరించారు. అయితే ఎన్ని యుద్ధ విమానాలకు నష్టం వాటిల్లింది, ఎంత మేరకు లాస్ జరిగింది అనేది ఆయన చెప్పలేదు. కానీ భారత్కు చెందిన 6 ఫైటర్ జెట్లను కూల్చివేసినట్లు పాక్ చేస్తున్న వాదనను మాత్రం ఆయన తోసిపుచ్చారు. అది ‘పూర్తిగా అవాస్తవం’ అని స్పష్టం చేశారు. 
 
భారత్ కోల్పోయిన యుద్ధ విమానాలపై సీడీఎస్ స్పందించడం ఇదే తొలిసారి కావావడం గమనార్హం. సింగపూర్‌లో శనివారంనాడు షాంగ్రి-లా-డైలాగ్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీడీఎస్ అనిల్ చౌహాన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఒక టీవీతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
యుద్ధ విమానాలను నేలకూల్చిన అంశం ముఖ్యం కాదని, ఎలాంటి పొరపాట్లు జరగాయన్నదే ముఖ్యమని ఆయన చెప్పారు. వ్యూహాత్మక తప్పిదాలు ఏమి జరిగాయో తెలుసుకుని వాటిని సరిచేసి రెండు రోజుల తర్వాత తిరిగి అమలు చేశామని, తిరిగి అన్ని విమానాలను సుదీర్ఘ లక్ష్యాల వైపు మళ్లించామని చెప్పారు.

“విమానాలను కోల్పోవడం కంటే దానికి గల కారణాలు కనుగొనడం ముఖ్యం. అప్పుడే భారత సైన్యం తన వ్యూహాలను మరింత మెరుగుపరుచుకొని, తిరిగి దాడి చేయగలగుతుంది” అని జనరల్ చౌహాన్ పేర్కొన్నారు.  భారత్-పాక్ మధ్య మే 7 నుండి నాలుగు రోజులపాటు జరిగిన యుద్ధంలో దేశీయ యుద్ధవిమానాల సామర్థ్యంపై అటు కేంద్రం, ఇటు మిలటరీ అధికారులు నేరుగా స్పందించలేదు. 

ఈ క్రమంలో సీడీఎస్ వివరణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల మొదట్లో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చేసినట్టు ప్రకటించారు. అయితే న్యూఢిల్లీ మాత్రం అవునని కానీ, కాదని చెప్పలేదు. అణు యుద్ధాన్ని ఆపానన్న డొనాల్డ్‌ట్రంప్‌ వ్యాఖ్యలపై స్పందించడానికి జనరల్ చౌహాన్ నిరాకరించారు. అయితే 4 రోజుల భారత్‌-పాక్‌ ఘర్షణ అణుయుద్ధానికి ఏమాత్రం చేరువకాలేదని స్పష్టం చేశారు. అణ్వాయుధాలను వాడాల్సిన అవసరం లేకుండా సమస్యల పరిష్కారానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని ఆయన తెలిపారు. 

భారత్‌ దాడులను అడ్డుకోవడంలో చైనా రక్షణ వ్యవస్థలు ప్రభావవంతంగా పనిచేశాయన్న పాక్ వాదనను ఆయన తోసిపుచ్చారు. చైనాకు సంబంధించిన రక్షణ వ్యవస్థలు సరిగ్గా పని చేయలేదని త్రిదళాధిపతి స్పష్టం చేశారు. భారీగా రక్షణ వ్యవస్థలు మోహరించిన పాక్‌ వాయుసేన స్థావరాలపైనే, మీటర్‌ కూడా తేడా లేకుండా అత్యంత కచ్చితమైన దాడులు చేశామని ఆయన స్పష్టం చేశారు.

కాగా, భవిష్యత్ యుద్ధాలు ఎలా ఉండనున్నాయనడానికి పాకిస్థాన్‌పై జరిపిన ఆపరేషన్ సిందూర్‌ నిదర్శనమని సీడీఎస్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. మోడ్రన్ వార్‌ఫేర్ అనేది ఇప్పుడు టెక్నాలజీ, సైబర్ ఆపరేషన్స్, సమాచారాన్ని కంట్రోల్ చేసే సామర్థ్యంపై ఆధారపడి ఉంటోందని తెలిపారు. ఆపరేషన్ ప్రారంభంలో మొదటి మూడు రోజులు ఇద్దరు ప్రధాన మహిళా అధికారులు ప్రధాన స్పోక్స్‌పర్సన్స్‌గా మీడియాకు సమాచారం ఇచ్చారని గుర్తు చేశారు. 

ఆపరేషన్ వేగవంతంగా నిర్వహించేందుకు మిలటరీ నాయకత్వం బిజీగా ఉండటంతో ఆ ఇరువురు మీడియా మందుకు వచ్చారని తెలిపారు. 10వ తేదీ తర్వాత మాత్రమే మీడియాకు వివరాలు చెప్పేందుకు డీజీఎంఓలు వచ్చారని పేర్కొన్నారు. సైబర్ దాడులపై మాట్లాడుతూ  రెండు వైపులా సైబర్ దాడులు జరిగాయని, అయితే ప్రధానమైన మిలటరీ సిస్టమ్‌లపై వాటి ప్రభావం చాలా తక్కువని చెప్పారు. మన మిలటరీ సిస్టమ్‌లు ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉండవని, అందువల్ల చాలావరకూ సురక్షితంగా ఉంటాయని తెలిపారు.