
15 జిల్లాలపై వర్ష ప్రభావం ఉండగా సుమారు 78 వేల మంది ప్రభావితులయ్యారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపుర్, మిజోరం రాష్ట్రాల్లో ఆకస్మిక వర్షాలతో జనజీవనం స్తంభించింది. అరుణాచల్ ప్రదేశ్ ఈస్ట్ కమెంగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి కారు అదుపుతప్పి పక్కన ఉన్న 150 మీటర్ల లోయలో పడింది. ఈ ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు మరణించారు.
లోయర్ సుబన్ సిరి జిల్లాలో కొండచరియలు విరిగిపడి పొలంలో పనిచేస్తున్న ఇద్దరు కూలీలు చనిపోయారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. రహదారులపై భారీగా వరదనీరు చేరటం వల్ల వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
అసోంలోని 6 జిల్లాల్లో ఏకధాటిగా కురిసిన భారీవర్షాలకు వరదలు సంభవించాయి. కామ్‌రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ముగ్గురు మహిళలుసహా ఐదుగురు చనిపోయారు. గువాహటితోపాటు పలు పట్టణాల్లో రహదారులు చెరువుల్లా మారాయి. జనజీవనం స్తంభించింది. కరెంటు సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
మణిపుర్‌లో ఏకధాటిగా కురిసిన వర్షాలకు సుమారు 883 ఇళ్లు దెబ్బతిన్నాయి. వేలాదిమంది ఇబ్బందిపడ్డారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మిజోరం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్‌లో కూడా భారీ వర్షాల కారణంగా పలువురు మరణించారు. వరద ప్రభావిత రాష్ట్రాల్లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయకచర్యలు చేపట్టాయి.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్